సుంకేసుల బ్యారేజీలో భారీ లీకేజీ
posted on Nov 1, 2025 4:27PM

కర్నూలు జిల్లా సుంకేసులలో ఉన్న తుంగభద్ర బ్యారేజీలో భారీ లీకేజీ సంభవించింది. 12వ గేట్ వద్ద భారీగా నీరు లీకవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనివల్ల తుంగభద్ర నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. బ్యారేజీ నుండి భారీగా నీరు విడుదల అవుతుండటంతో, పరిసర గ్రామాల ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
భారతదేశంలోనే పురాతనమైన ఈ సుంకేసుల బ్యారేజీ 1858లో నిర్మాణం ప్రారంభమై 1861లో పూర్తయింది. మొత్తం 30 గేట్లు కలిగిన ఈ బ్యారేజీలో 12వ గేట్ వద్ద ప్రస్తుతం లీకేజీ నమోదైంది. ఇంజనీరింగ్ బృందం అత్యవసర మరమ్మతు పనులు చేపట్టింది.నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ అవసరమైతే అదనపు నీటి విడుదల చేపట్టనున్నట్లు తెలిపారు.