మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శుక్రవారం (జులై 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం. అంతకు ముందు గురువారం (జులై 3) హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే  కు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఖర్గేకు స్వాగతం పలికిన వారిలో  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు. అదలా ఉంచితే  గాంధీ భవన్ లో జరిగే పీఏసీ భేటీలో మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు ఖర్గే పార్టీ ఆఫీస్‌ బేరర్స్‌తో సమావేశమౌతారు. అంతే కాకుండా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఖర్గేతో భేటీ అయ్యారు.  ఇక   స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై పార్టీ కీలక నేతలతో ఖర్గే చర్చిస్తారు. 
మల్లికార్జున ఖర్గేతో  సీఎం రేవంత్ భేటీ Publish Date: Jul 4, 2025 11:06AM

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన   సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో కేసీఆర్ బాధపడుతున్నారు. రోజుల తరబడి టెంపరేచర్ కంట్రోల్ లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను యశోదా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. యశోదా ఆస్పత్రిలో   వైద్యులు  కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు.  ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, జ్వరం తగ్గి,  వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టులను చూసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇలా ఉండగా అస్వస్థతతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో  అడ్మిట్ అయిన విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోదా ఆస్పత్రి వైద్యులు, అధికారులతో ఫోన్ లో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.  
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం రేవంత్ Publish Date: Jul 4, 2025 10:46AM

హస్తినకు చేరిన ఓరుగల్లు వివాదం!

వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందా? అంటే..  విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టుగా  హస్తం పార్టీ  రెండుగా చీలి పోయిందని  మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.  నిజానికి, ఒక్క వరంగల్ జిల్లా అనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పరిస్థితి కొంచెం అటూ ఇటూగా  ఇలాగే ఉందనీ ఏ ఒక్క జిల్లాల్లోనూ హస్తం పార్టీ ఒకటిగా లేదని, గాంధీ భవన్  సాక్షిగా గుసగుసలు వినిపిస్తున్నాయి.   అదలా ఉంచి  వరంగల్ విషయానికి వస్తే..  వరంగల్ జిల్లాలో పరిస్థితి  రోజు రోజుకు శృతి మించి రాగాన పడుతోందని, అంటున్నారు. ఇప్పటికే..  జిల్లా సరిహద్దులు దాటి గాంధీ భవన్ కు  చేరిన  వరంగల్ పచాయతీ తాజా సమచారాన్ని బట్టి ఢిల్లీకి చేరిందని అంటున్నారు. ఓ వంక హస్తం పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సాగుతున్న  కిస్సా కుర్సీకా  వివాదం ఇంకా ఒక  కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి సర్డుమణిగినట్లు కనిపిస్తున్నా.. మళ్ళీఎప్పుడైనా భగ్గుమనే ప్రమాదం ఉందని భావిస్తునారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజుకున్న వివాదాన్ని ఉపేక్షిస్తే ముందు ముందు మరంత ప్రమాదంగా పరిణమించే ప్రమాదం లేక పోలేదని..  అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిందని  గాంధీ భవన్ వర్గాల సమాచారం.  అదలా ఉంటే.. అధికారంలోకి వచ్చేందుకు, వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు   కాంగ్రెస్ పార్టీ  ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నాయకులకు పదవులు  ఎరగా వేయడం వలన తలెత్తిన సమస్యలు, చిలికిచిలికి గాలివానగా మారి పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొండా సురేఖ ఫ్యామిలీ విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు  కొండా ఫ్యామిలీకి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. ఒకే టికెట్ తో సరిపెట్టారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ ప్రామిస్  చేశారు. కానీ.. అదీ నెరవేర్చలేదు. కొండా సురేఖకు మంత్రి పదవి అయితే ఇచ్చారు కానీ, గిట్టుబాటయ్యే శాఖలు ఇవ్వలేదన్న అసంతృప్తిని కొండా మురళీ  దాచుకోలేదు. మంత్రి సురేఖ శాఖల్లో ఎక్కడా పైసలు రాలడం లేదని..  ఇప్పటికీ  ఆమె నెల వారీ ఖర్చులకు తానే పైసలు పంపుతున్నాని మీడియా ఎదుటనే ప్రకటించారు. అంతేకాకుండా.. ఇప్పుడేమో ఇచ్చిన సురేఖ కుర్చీకి ఎసరు పెడుతున్నారు. అందుకే..  మంత్రి కొండా సురేఖ కుటుంబంలో అసంతృప్తి భగ్గుమంటోంది. వరంగల్ రాజకీయాల్లో రగులుతున్న వర్గ పోరుకు ఇదే ప్రధాన కారణంగా పరిశీలకులు పేర్కొం టున్నారు. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒరలో రెండు కాదు.. అంతకంటే ఎక్కువ కత్తులు ఇమిడ్చే ప్రయత్నం చేయడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మీనాక్షి నటరాజన్  ద్వారా సమాచారం తెప్పించుకున్న కాంగ్రెస్ అధిష్టానం  వరంగల్ వివాదాన్ని మొగ్గలోనే తుంచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే.. తాజాగా కొండా దంపతుల కుమార్తె, కొండా సుష్మిత పటేల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీచేస్తున్నానని సోషల్ మీడియా అకౌంట్‌  లో మార్పులు ద్వారా సంకేతాలు ఇవ్వడంతో వరంగల్ వివాదం మరో మలుపు తీసుకుందని అంటున్నారు. అదొకటి అయితే.. కొండా దంపతులు గురువారం (జులై  3) కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిశారు.  ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అంశాలపై ఆమెకు 16 పేజీల నివేదికను నివేదిక ఇచ్చారు. అలాగే.. తమ పై వచ్చి ఆరోపణలపై కొండా దంపతులు  మీనాక్షి నటరాజన్ కు సమాధానంలాంటి వివరణ ఇచ్చారు.   రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని చెప్పిన కొండా దంపతులు.. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో..  వరంగల్ వివాదం తీవ్ర రూపం దాలుస్తున్నట్లు గుర్తించిన మీనాక్షి నటరాజన్ అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శుక్రవారం (జులై 4) రాష్ట్రానికి వస్తున్న  నేపద్యంలో.. విషయాన్ని  అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఏమి చేస్తుంది? చూడవలసి వుందని అంటున్నారు.
హస్తినకు చేరిన ఓరుగల్లు వివాదం! Publish Date: Jul 4, 2025 10:24AM

కేసీఆర్ భోళా శంక‌రుడు.. కవిత కామెంట్లపై నెటిజన్ల సెటైర్లు

ఈ శ‌తాబ్దానికే ఇది జోక్ కావ‌చ్చు. ఈ భూమ్యాకాశాల మ‌ధ్య కేసీఆర్ కి తెలియ‌ని రాజ‌నీతి లేదు. రెడ్డి, క‌మ్మ‌గా విడిపోయి కొట్టుకు ఛ‌స్తున్న ఉమ్మ‌డి ఆంధ్ర రాజ‌కీయాల్లో వెల‌మ‌ల పాత్ర‌ను తిరిగి తీసుకురావ‌డంలో అప‌ర చాణ‌క్యుడ‌న్న పేరు సాధించారాయ‌న‌. అంతేనా  కేసీఆర్ అన్నీ తెలిసే కావాల‌నే చేశారని అంటారు. అలాగ‌ని కులాభిమానం అయినా ఉందా? అంటే అదీ లేద‌ని చెబుతారు. అంత‌టి స్వార్ధ‌ప‌రుడు కేసీఆర్ అన్న పేరు ఈనాటిది కాద‌ని అంటారు. సాటి వెల‌మ‌కు మంత్రిత్వం ఇచ్చార‌ని కూడా చూడ‌కుండా.. ఏకంగా టీడీపీ బ‌య‌ట‌కొచ్చి... అప్పుడెప్పుడో ముగిసిపోయిన అధ్యాయం లాంటి తెలంగాణ ఉద్య‌మాన్ని తిరిగి నిద్ర‌లేపి.. దాన్ని అంచ‌లంచెలుగా.. ముహుర్తాలు చూసుకుని మ‌రీ.. ఉద్య‌మాలు చేయ‌డంలో భోళాత‌నం ఎక్క‌డో ఎవ‌రికీ అర్ధం కాదని అంటారు. ముహుర్తాలంటే గుర్తుకొచ్చింది.. తాను డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి చేయ‌లేన‌ని అలిగి ఇంట్లో కూర్చున్న‌పుడు ఒక గోదారి జిల్లాల‌కు చెందిన బ్రాహ్మ‌డు కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చార‌నీ.. ఆయ‌న వ‌చ్చే పుష్క‌ర‌కాలం త‌ర్వాత మీకు అఖండ రాజ‌యోగం ప‌ట్ట‌నుంద‌ని.. స్పీక‌రేం క‌ర్మ‌.. ఏకంగా సీఎం అయ్యే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌నీ.. పెద్ద పెద్ద రాజ‌నీతిజ్ఞులే మీ ముందు బ‌లాదూర్ అయిపోతార‌నీ.. చెప్పారనీ.. ఆ వెంట‌నే ఈయ‌న తెలంగాణ వాదాన్ని వెలికి తీసి ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్ లాంటి వారి చేత తెలంగాణ పాఠాలు వ‌ల్లె వేయించుకున్న‌ట్టు ఒక స‌మాచారం. ఆపై కావాల‌నే ఉన్న ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డం, అన‌వ‌స‌రంగా ఉప ఎన్నిక‌లొచ్చేలా చేయ‌డం.. అటు పిమ్మ‌ట అమాయ‌క పిల్ల‌ల ప్రాణాలు పోయేలా రెచ్చ‌గొట్ట‌డం. అందుకు అంద‌మైన బ‌లిదానం అంటూ పేర్లు పెట్ట‌డం వంటివి కూడా భోళా శంక‌రుడి లీల‌లేనా?. అక్కా అన్న‌ది కొంద‌రి ప్ర‌శ్న‌. ఎట్ట‌కేల‌కు తెలంగాణ వ‌చ్చీరావ‌డంతో ద‌ళితుల‌ను ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని అన్న మాట‌ను కాస్తా తీసి హుస్సేన్ సాగ‌ర్ గ‌ట్టు మీద పెట్టి.. ఉద్య‌మ‌కారుడు ఉద్యోగి అయ్యాడ‌ని చెప్పుకోవ‌డంలోనూ భోళాత‌న‌ముందా?  కవితక్కా..! కాళేశ్వ‌రం క‌థ‌ల నుంచి మొద‌లు పెడితే.. ప్ర‌తి దాన్లో రాజ‌కీయం. ఆఖ‌ర్న ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్యమంత్రికి ఇక్క‌డ ప‌దేళ్ల పాటు ఎక్క‌డ రాజ‌ధాని హోదా ఇవ్వాల్సి వ‌స్తుందోన‌ని ఆయ‌న్ను కాస్తా ఓటుకు నోటు కేసులో త‌న టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇరికించి మ‌రీ త‌ర‌మ‌గొట్ట‌డంలోనూ భోళాత‌న‌మేనా అక్కా.. అని నిల‌దీస్తున్నారు కొంద‌రు. కేసీఆర్ క‌థ‌లు.. చెబితే చారెడు.. వింటే మూరెడు అన్న‌ట్టు... లెక్క‌లేన‌న్ని లీల‌లు. పేప‌రు లీకేజీల ద‌గ్గ‌ర్నించి.. పేప‌రోళ్ల‌ను పాతాళంలో పాతి పెడ‌తా! అనే వ‌ర‌కూ ఎన్నో.. ఎన్నెన్నో..  అదేమంటే మాపై ఇంత నెగిటివ్ గా రాస్తున్న వారికి ఉచితాలు, వ‌రాలివ్వాలా? అంటూ నేరుగానే అన‌డ‌మొక‌టి. ఇదంతా కూడా భోళాత‌న‌మేనా అక్కా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర- తెలంగాణ తేడా లేకుండా  ఆయ‌న కోసం రాసినోళ్లు, క‌థ‌నాలు వండి వార్చినోళ్లు, అందులో భాగంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నోళ్లూ.. వీరంతా క‌ల‌సి మ‌ట్టి కొట్టుకు పోగా.. ఎక్క‌డో మీకోసం యాగాలు చేసిన స్వామీజీల‌కు రూపాయ లెక్క‌న స్థ‌లాలూ పొలాలూ ఇవ్వ‌డంలోనూ భోళా మ‌నిషినే చూసుకోవాలా అక్కా మేము.. మా ఖ‌ర్మ కాకుంటే అంటూ  కొంద‌రు ఆనాటి పాత జ్ఞాప‌కాల‌ను తిర‌గ‌దోడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో కేసీఆర్ స్పంద‌న ఎలాంటిద‌ని విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు.. క‌విత‌క్క చెప్పిన స‌మాధానం.. కేసీఆర్ ఒక భోళా శంక‌రుడు, ఆయ‌న కింది వారు ఇలాంటి ప‌నులు చేసి ఉంటారేమో అంటూ ఆమె చెప్పిన ఈ కొటేష‌న్ పై ఒక్కొక్క‌రు.. పై విధంగా కామెంట్లు చేస్తున్నారు.
 కేసీఆర్ భోళా శంక‌రుడు.. కవిత కామెంట్లపై నెటిజన్ల సెటైర్లు Publish Date: Jul 4, 2025 10:09AM

తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు

తిరుమల కొండపై  ఏనుగులు హల్‌ చల్‌ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోనే ఏనుగుల గుంపు తిష్టవేసి ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. యువకులు గట్టిగా కేకలు వేయడంతో ఏనుగుల గుంపు కొద్దిగా వెనక్కు వెళ్లింది. గత కొద్ది రోజులుగా శేషాచలం అడవుల నుంచి ఏనుగులు సమీప గ్రామాలలోకి ప్రవేశించి పంటపొలాలను ధ్వంసంచేసిన ఘటనలు జరిగాయి. దీంతో వాటిని తిరిగి అడవుల్లోకి తరిమేసేందుకు అధికారులు శతథా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏనుగులు ఏకంగా తిరుమల ఘాట్ రోడ్డు పైకి రావడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  అటవీ అధికారులు రంగ ప్రవేశం చేసి ఏనుగులను అడవిలోనికి తరిమివేయడంతో  భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. 
తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు Publish Date: Jul 4, 2025 9:49AM

పిల్లలలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే  చెడుదారిలో పడ్డారని అర్థం..!

  పెద్దలు ఎల్లప్పుడూ స్నేహాలు మంచిగా ఉండాలని సలహా ఇస్తారు. దీని వెనుక వారి ఆలోచన ఏమిటంటే- 'స్నేహం ఎలా ఉంటుందో, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.' ఎవరైనా సరే ఏ రకమైన వ్యక్తులతో సమయం గడుపుతారో, వారి ఆలోచన, ప్రవర్తన,  అలవాట్లు క్రమంగా ఎదుటివారిలో  రావడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా  పిల్లలలో ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. ఎందుకంటే వారు ఈ సమయంలో భావోద్వేగపరంగా పెళుసుగా ఉంటారు.   ఇతరుల వల్ల  సులభంగా ప్రభావితమవుతారు. పిల్లలు తప్పుడు స్నేహంలో పడితే, అది వారి ప్రవర్తన, నమ్మకం,  చదువులతో పాటు వారి భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. వారిలో కనిపించే కొన్ని అలవాట్ల కారణంగా వారు చెడుదారిలో పడ్డారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయుల గురించి చెడుగా మాట్లాడటం.. ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా వారిని తక్కువ అంచనా వేయడం ప్రారంభించినప్పుడు,  పిల్లవాడు చెడు సహవాసంలో పడిపోయాడని అర్థం చేసుకోవాలి. ఇది పిల్లలకు చదువు మీద  చులకన భావం ఏర్పడేలా చేస్తుంది. చెడు స్నేహితుల సమర్థింపు.. పిల్లవాడు తన స్నేహితుల్లో ఎవరి తప్పుడు ప్రవర్తననైనా సమర్థించడం ప్రారంభిస్తే , ఆ పిల్లవాడు ఆ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యాడని స్పష్టమైన సంకేతం.  ఇది  హెచ్చరిక సంకేతం అవుతుందట.  ఇలాంటి వారు స్నేహితుల ద్వారా  ాలా దెబ్బ తింటారు. నెగెటివ్ గా మాట్లాడటం..  పిల్లవాడు అకస్మాత్తుగా తన గురించి ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా అతని ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, అది అతని స్నేహితుల  యొక్క ప్రతికూల ప్రభావం కావచ్చు.  ఇది పిల్లవాడిని ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. రహస్యం.. పిల్లవాడు అకస్మాత్తుగా ఫోన్ దాచి స్నేహితులతో మాట్లాడటం,  లేదా చాట్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌ను దాచిపెట్టడం వంటివి చేస్తే  తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.  పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా తప్పు పనులు చేసే అవకాశం ఉంటుంది. చదువుకు దూరం కావడం.. పిల్లలు అకస్మాత్తుగా చదువుకు దూరం కావడం, హోంవర్క్ వాయిదా వేయడం, తరగతులకు హాజరు కాకపోవడానికి సాకులు వెతకడం లేదా అస్సలు చదువుకోకూడదని అనిపించడం ప్రారంభిస్తే, అది సోమరితనం వల్ల మాత్రమే కాకపోవచ్చు. చెడు సహవాసం వల్ల కూడా ఇలా చేసే అవకాశం ఉంటుంది.                                  *రూపశ్రీ.
పిల్లలలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే  చెడుదారిలో పడ్డారని అర్థం..! Publish Date: Jul 4, 2025 9:30AM

రోజూ పచ్చి టమోటాలు తింటే జరిగే మేలు ఏంటో తెలుసా?

  భారతీయ వంటగదిలో టమోటా ఒక ముఖ్యమైన భాగం. అది కూరలో అయినా, సలాడ్ అయినా లేదా చట్నీ అయినా టమోటా లేకుండా రుచి అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే టమోటాను ఇలా కూరలలో కాదు.. పచ్చిగా తినమని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. పచ్చి టమోటాలలో లైకోపీన్, విటమిన్ సి, పొటాషియం,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని వివిధ భాగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా సలాడ్ లో పచ్చి టమోటా చేర్చుకోవడం చూస్తూంటాం. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల కలిగే 6 గొప్ప ప్రయోజనాలను తెలుసుకుంటే.. చర్మానికి చేసే మేలు.. పచ్చి టమోటాలలో ఉండే లైకోపీన్,  విటమిన్ సి చర్మానికి సహజమైన బూస్టర్‌గా పనిచేస్తాయి.  చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.  ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల చర్మం  మెరుపు పెరుగుతుంది.  వృద్ధాప్య సంకేతాలు నెమ్మదిస్తాయి.  మొటిమలు లేదా జిడ్డుగల చర్మం సమస్యలు ఉంటే టమోటాలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి.. టమోటాలలో లభించే లైకోపీన్, పొటాషియం,  ఫోలేట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది,  రక్త నాళాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ పచ్చి టమోటాలు తినడం వల్ల గుండె జబ్బులు, ముఖ్యంగా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి టమోటాలు సహజ ఔషధంగా పనిచేస్తాయి. దీనిని సలాడ్, జ్యూస్ లేదా నేరుగా కోసి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో..  బరువు తగ్గించుకునే ప్రయాణంలో ఉన్నవారికి  టమోటా భలే సహాయపడుతుంది.  ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి,  ఫైబర్,  నీరు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. టమోటా జీవక్రియను కూడా సక్రియం చేస్తుంది.  శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును నెమ్మదిగా కాల్చడంలో సహాయపడుతుంది. పొట్ట ఆరోగ్యానికి..  టమోటాలలో ఉండే ఫైబర్, సహజ ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. ప్రతిరోజూ  టమోటా తినడం వల్ల కడుపు శుభ్రపడుతుంది, పేగు పనితీరు మెరుగుపడుతుంది. దీనితో పాటు, ఇది ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మద్దతు ఇస్తుంది, ఇది మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి.. టమాటాలో విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, వైరల్,  అలెర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో శరీరం సులభంగా అనారోగ్యానికి గురవుతుంది. ఇలాంటి వాతావరణంలో  టమోటా  రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లలు,  వృద్ధులకు కూడా  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి పోషకాలను పొందడానికి దీనిని  తాజాగా తినడం మంచిది. డిటాక్స్ చేస్తుంది.. టమోటాలు శరీరం నుండి విషాన్ని తొలగించే సహజ నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కాలేయం,  మూత్రపిండాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది,  శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బయటి ఆహారాన్ని ఎక్కువగా తినేవారికి లేదా అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నవారికి ప్రతిరోజూ టమోటాలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీర శక్తిని కూడా నిర్వహిస్తుంది,   అలసటను దూరం చేస్తుంది. ఉదయం లేదా భోజనానికి ముందు టమోటాను  తినడం మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..  
రోజూ పచ్చి టమోటాలు తింటే జరిగే మేలు ఏంటో తెలుసా? Publish Date: Jul 4, 2025 9:30AM

భారత జాతి ఆత్మగౌరవ ప్రతీక జాతీయ జెండా

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి  నేడు. దేశ ఆత్మగౌరవ ప్రతీకగా జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశ భక్తులు పింగళి వెంకయ్య. ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. గొప్ప దేశ భక్తుడు పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనకందరికీ గర్వకారణమని చంద్రబాబు ట్వీట్ చేశారు. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కూడా పింగళి వెంకయ్యకు నివాళులర్పించారు. దేశభక్తులు, రచయత అయిన పింగళి జాతీయ పతాకాన్ని రూపొందించారనీ, అలాగే భారత జాతికి ఆయన అందించిన గొప్ప సేవలను స్మరించుకుందామని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు.   పింగళి వెంకయ్య పిన్న వయస్సులోనే దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరుబాట పట్టారు. 19ఏళ్ల వయస్సులోనే దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో బోయెర్ సమరంలో పాల్గొన్నారు. అక్కడే ఆయనకు మహాత్మాగాంధీతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం స్నేహానుబంధంగా దాదాపు అర్ధశతాబ్దం పాటు కొన సాగింది. ఆ సమయంలోనే స్వతంత్ర భారత పతాకం ఎలా ఉండాలన్నదానిపై వారిరువురి మధ్యా సమాలోచనలు జరిగాయని చెబుతుంటారు. జాతీయ పతాక రూపకల్పనపై అప్పటి నుంచే వెంకయ్య దృష్టి పెట్టారు. 1916లోనే దేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని రచించారు. 1996లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండానే అప్పట్లో లక్నోలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు. ఆ తరువాత మహాత్మా గాంధీ సూచించిన చిన్న చిన్న మార్పులతో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకమే జాతి చిహ్నంగా ఇప్పటికీ దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా రెపరెపలాడుతోంది.  స్వాతంత్ర్య ఉద్యమంలో పింగళి వెంకన్నది చిరస్మరణీయమైన పాత్ర. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం వంటి ఆందోళనలలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు.  
భారత జాతి ఆత్మగౌరవ ప్రతీక జాతీయ జెండా Publish Date: Jul 4, 2025 9:27AM

గిల్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్

  ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో  జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269 ; 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓవర్‌ నైట్ స్కోరు 41తో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (89; 137 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (42; 103 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్ 2, జోష్ టంగ్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
గిల్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్ Publish Date: Jul 3, 2025 9:28PM

భారీ ఉగ్ర కుట్ర భగ్నం..విస్పోటక పదార్థాలు స్వాధీనం

  అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో  అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.  వీరు ఆల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగి వున్నారన్నారు.   అన్నమయ్య జిల్లా పోలీసుల చొరవతో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించారు న్నారు. గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయకుడు తో కలసి డి.ఐ.జి కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. గత నెల 30న తమిళనాడు పోలీసులు పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను అమలు చేశారన్నారు.  ఈ నిందితులు 1999 నుండి పరారీలో ఉండగా, వారు గత 20 సం. గా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో (అబూ బకర్ సిద్ధిక్ అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీ – మంసూర్ పేరుతో) నివసిస్తున్నారన్నారు.  విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత, అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్  ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి, రాయచోటిలోని కొత్తపల్లి మరియు మహబూబ్ బాషా వీధిలో ఉన్న నిందితుల ఇళ్లను చట్టపరమైన విధానాల ప్రకారం శోధించారని ఆయన తెలిపారు.  ఈ గృహ శోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయన్నారు., వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు (ఐఇడియస్ ) తయారు చేయవచ్చు అన్నారు. ఈ పదార్థాలు భారతదేశ పౌరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయన్నారు. ఈ శోధనతో దేశ స్థాయిలో ప్రమాదం నివారించబడిందన్నారు. అబూ బకర్ సిద్ధిక్ @ అమానుల్లా మరియు మహమ్మద్ అలీ  మంసూర్ అనే ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి ఈ సామగ్రిని పోలీస్ బృందం స్వాధీనం చేసుకుందన్నారు.వీరు "అల్ ఉమ్మా" అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగిన వారిగా గుర్తించబడ్డారన్నారు. నిందితుల భార్యలు మహిళ పోలీసుల పై దాడికి యత్నం.    ఈ ఇంటి శోధన సందర్భంగా, నిందితుల భార్యలు అయిన సైరా భాను (అబూ బకర్ సిద్ధిక్ భార్య) మరియు షేక్ షమీం (మహమ్మద్ అలీ భార్యలు) పోలీసులపై ప్రతిఘటన చేయడమే  కాకుండా మహిళా పోలీసులపై దాడికి యత్నించారన్నారు.   సైరా భాను మరియు షమీం లను శోధనకు అడ్డుపడినందుకు మరియు మహిళా పోలీసులపై దాడికి ప్రయత్నించినందుకు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్ కి పంపామన్నారు. వీరికి నిందితుల ఉగ్రచర్యలపై ఎంత సంబంధముందో అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందని డి.ఐ.జి పేర్కొన్నారు. పోలీసుల నిరంతర శ్రమతో ఇంటిని శోధించి పై విస్ఫోటక సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని డి.ఐ.జి వివరించారు.  ఈ ఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు  చేసినట్లు డి.ఐ.జి తెలిపారు. ఈ కేసులు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. ఎగ్మోర్ ఘటన రోజు అనేక ఇతర బాంబులు కూడా వివిధ ప్రాంతాలలో (చెన్నై, త్రిచ్చి, కోయంబత్తూరు) పగులగొట్టబడ్డాయి. 1999లో కోచిన్-కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో ఈ నిందితులు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలించబోతుండగా, ఆ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అవి కాసర్‌గోడ్ వద్ద స్వాధీనం చేసుకున్నారన్నారు.. ఈ ఇద్దరు నిందితులు గత 20 సంవత్సరాలుగా రాయచోటి పట్టణంలో తప్పుడు గుర్తింపులతో నివసిస్తూ, స్థానికంగా వివాహాలు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారన్నారు. ఇంకా ఇతర సహచర నిందితుల వివరాలు గుర్తించే పనిలో ఉన్నామన్నారు.  మరిన్ని వివరాలు తర్వాత అడ్వైజరీలో తెలియజేయబడతాయని డి.ఐ.జి తెలిపారు.
భారీ ఉగ్ర కుట్ర భగ్నం..విస్పోటక పదార్థాలు స్వాధీనం Publish Date: Jul 3, 2025 9:12PM

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులు నిర్వీర్యం

  అన్నమయ్య జిల్లా  రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 30 ఏళ్లుగా పట్టణంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు అబూ బకర్ సిద్ధిక్ అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీనీ ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద దొరికిన సుట్ కేసు బాంబు బకెట్ బాంబులను  రాయచోటి కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు పేల్చేశారు.  తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో  అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.  వీరు ఆల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగి వున్నారన్నారు.  అన్నమయ్య జిల్లా పోలీసుల చొరవతో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించామన్నారు.  
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులు నిర్వీర్యం Publish Date: Jul 3, 2025 9:01PM

గిల్ ద డబుల్

  ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. తొలి టెస్టులో సెంచురీ చేసిన గిల్. రెండో టెస్టులో డబుల్ సెంచురీ ,అది కూడా ఆట ముగిసే సమయానికి నాట్ అవుట్ గా ఉన్నాడు. ఇప్పటికే  ఎన్నో రికార్డులను మోత మోగించాడు. ఇంగ్లండ్ లో ఒక కెప్టెన్ గా 179 పరుగుల హయ్యస్ట్ స్కోర్ రికార్డు అజర్ పేరిట ఉండేది. 1990 ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ఈ రికార్డు నమోదు చేశాడు అజర్. ఇపుడా రికార్డు క్రాస్ చేశాడు గిల్. అంతేనా విరాట్ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై డబుల్ బాదిన రెండో కెప్టెన్ కూడా గిల్లే. SENA దేశాల్లో శతకం చేసిన ఆరో ఏషియన్ కెప్టెన్ గానూ నిలిచాడు. టెస్టుల్లో డబుల్ చేసిన ఆరో కెప్టెన్ గా మరో రికార్డు సృష్టించాడు. 2003 తర్వాత ఇంగ్లండ్ పై ద్విశతం చేసిన తొలి విదేశీ ఆటగాడు కూడా గిల్లే. మొత్తం మీద ఇంగ్లండ్ బౌలర్లను తన దైన బ్యాటింగ్ పెర్ఫామెన్స్ తో ఒక ఊపు ఊపేస్తున్నాడు కెప్టెన్ గిల్. త్రిశతం(300) కూడా బాదేసి సెహ్వాగ్ పేరిట ఉన్న టెస్ట్ హయ్యస్ట్ ఇండియన్ ప్లేయర్ రికార్డు కూడా తిరగరాసే అవకాశం ఉంది.
గిల్ ద డబుల్ Publish Date: Jul 3, 2025 8:41PM

హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గేకు సీఎం రేవంత్‌ ఘన స్వాగతం

  ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో ఖర్గే పాల్గొననున్నారు. రేపు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం, బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తరలిరావాలని సక్సెస్​చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేరుగా మండల అధ్యక్షులతో మాట్లాడున్నారు.  
హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గేకు సీఎం రేవంత్‌ ఘన స్వాగతం Publish Date: Jul 3, 2025 8:33PM

హస్తినకు చేరిన..ఓరుగల్లు వివాదం

  వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ  రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి, ఒక్క వరంగల్ జిల్లా అనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉందని ఏ ఒక్క జిల్లాల్లోనూ హస్తం పార్టీ ఒకటిగా లేదని, గాంధీ భవన్  సాక్షిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే, అదలా ఉంచి  వరంగల్ విషయానికి వస్తే, వరంగల్ జిల్లాలో పరిస్థితి, రోజు రోజుకు శృతి మించి రాగాన పడుతోందని, అంటున్నారు. ఇప్పటికే, జిల్లా సరిహద్దులు దాటి గాంధీ భవన్’కు  చేరిన, వరంగల్ పచాయతీ తాజా సమచారాన్ని బట్టి ఢిల్లీకి చేరిందని అంటున్నారు.ఓ వంక హస్తం పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్’మధ్య, సాగుతున్న ‘కిస్సా కుర్సీకా’ వివాదం ఇంకా ఒక  కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి సర్డుమణిగినట్లు కనిపిస్తున్నా,మళ్ళీఎప్పుడైనా భగ్గుమనే ప్రమాదం ఉందని భావిస్తునారు.ఈ నేపద్యంలో తెలంగాణలో రాజుకున్న వివాదం ఉపేక్షిస్తే ముందు ముందు మరంత ప్రమాదంగా పరిణమించే ప్రమాదం లేక పోలేదని, అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిందని, గాంధీ భవన్ వర్గాల సమాచారంగా చెపుతున్నారు.  అదలా ఉంటే,అధికారంలోకి వచ్చేందుకు, వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు   కాంగ్రెస్ పార్టీ’ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నాయకులకు పదవులు  ఎరగా వేయడం వలన తలెత్తిన సమస్యలు, చిలికిచిలికి గాలివానగా మారి పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. కొండా సురేఖ ఫ్యామిలీ విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు, కొండా ఫ్యామిలీకి రెండు ఎమ్మెల్యే టికెట్లు,ఇస్తామన్నారు,ఇవ్వలేదు. ఒకే టికెట్’తో సరిపెట్టారు.కొండా మురళీకి ఎమ్మెల్సీ ప్రామిస్’ చేశారు.కానీ,అదీ లేదు.కొండా సురేఖకు మంత్రి పదవి అయితే ఇచ్చారు,కానీ, గిట్టుబాటయ్యే శాఖలు ఇవ్వలేదన్న అసంతృప్తిని కొండా మురళీ  దాచుకోలేదు.మంత్రి సురేఖ శాఖల్లో ఎక్కడ పైసలు రాలడం లేదని, ఇప్పటికీ, ఆమె నెల వారీ ఖర్చులకు తానే పైసలు పంపుతున్నాని మీడియా ఎదుటనే ప్రకటించారు. అంతేకాకుండా,ఇప్పుడేమో,ఇచ్చిన సురేఖ కుర్చీకి ఎసరు పెడుతున్నారు, అందుకే, మంత్రి కొండా సురేఖ’కుటుంబంలో అసంతృప్తి భగ్గుమంటోంది,వరంగల్ రాజకీయాల్లో రగులుతున్న వర్గ పోరుకు ఇదే ప్రధాన కారణంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒరలో రెండు కాదు, అంతకంటే ఎక్కువ కత్తులు ఇమిడ్చే ప్రయత్నం చేయడం వల్లనే ఈరోజు,ఈ పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, మీనాక్షి నటరాజన్’ ద్వారా సమాచారం తెప్పించుకున్న కాంగ్రెస్ అధిష్టానం, వరంగల్’ వివాదాన్ని మొగ్గలోనే తున్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, తాజాగా కొండా దంపతుల కుమార్తె, కొండా సుష్మిత పటేల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీచేస్తున్నానని సోషల్ మీడియా అకౌంట్‌’ లో మార్పులు ద్వారా సంకేతాలు ఇవ్వడంతో వరంగల్’ వివాదం మరో మలుపు తీసుకుందని అంటున్నారు. అదొకటి అయితే, కొండా దంపతులు ఈరోజు (జులై 3) కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి, ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అంశాలపై ఆమెకు 16 పేజీల నివేదికను నివేదిక ఇచ్చారు. అలాగే, తమ పై వచ్చి ఆరోపణలపై కొందాడంపతులు, మీనాక్షి నటరాజన్’కు సమాధానం చెప్పారు. రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని చెప్పిన కొండా దంపతులు.. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు.దీంతో, వరంగల్, వివాదం తీవ్ర రూపం దాలుస్తున్నట్లు గుర్తించినమీనాక్షి నటరాజన్’ అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెపుతున్నారు. ముఖ్యమంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జూలై 4న రాష్ట్రానికి వస్తున్న  నేపద్యంలో.. విషయాన్ని  అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎలా స్పందిస్తుంది, ఏమి చూస్తుంది చూడవలసి వుందని అంటున్నారు.  
హస్తినకు చేరిన..ఓరుగల్లు వివాదం Publish Date: Jul 3, 2025 8:08PM

ప్రియుడి మోజులో పడి కూతురిని చంపిన తల్లి.. ఇద్దరికి జీవిత ఖైదు

  ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన మొరంపల్లి గ్రామానికి చెందిన శాంత రామసముద్రం మండలానికి చెందిన శ్రీనివాసులు ఇద్దరూ గ్రామాలలో రికార్డింగ్ డ్యాన్స్ లు చేస్తూ జీవనం సాగించేవారు. ఒకే వృత్తిలో ఉండటంతో వీరిద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడింది. కాగా శాంతకు పెళ్లయి కూతురు ఉండేది. వారి మధ్య కొనసాగుతున్న అక్రమ సంబంధానికి ఆమె కూతురు అడ్డుగా ఉంటుందని భావించిన ఇద్దరూ దారుణానికి ఒడిగట్టారు.  పుంగనూరు మండలంలోని పెద్దతాండ గ్రామంలో డ్యాన్స్ ప్రోగ్రాం నిమిత్తం ఒక ఆటోలో వెళ్తున్న సమయంలో, వారు ప్రయాణిస్తున్న ఆటోలోనే చిన్నారిని ఇనుపరాడుతో తలపై గుద్ది హత్య చేసి, ఆమె మృతదేహాన్ని గుడ్డలో కట్టి ఆటోలో ఉంచారు. అనంతరం అదే ఆటోలో మదనపల్లి మండలంలోని మదనపల్లె–చెంబకూర్ రోడ్డులో ఉన్న దాసరి వంకలో మృతదేహాన్ని పారవేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై ఆ రోజు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లో ఆ గ్రామ వి.ఆర్.ఓ కావలి వెంకటరమణ ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్ఐ  కె.వి.హెచ్.నాయుడు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్  ఎం. మురళి దర్యాప్తును చేపట్టి సంఘటనా స్థల పరిశీలన, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగా ఈ హత్య శాంత మరియు ఆమె ప్రియుడు శ్రీనివాసులు కలిసి చేశారని నిర్ధారించారు.  2017 డిసెంబర్ 5న లభించిన సమాచారంతో, మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ మదనపల్లి-చెంబకూర్ రోడ్డులోని లాబాల గంగమ్మ దేవాలయం వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారు ప్రయాణించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. సదరు కేసులో ముద్దాయికి శిక్ష పడుటకు కృషి చేసిన అప్పటి పుంగనూరు ఇన్స్పెక్టర్ టి.సాయినాథ్, ఇప్పటి చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ అడిషనల్ పి.పి  జయనారాయణ రెడ్డి, కోర్టుకు సాక్షాలను సకాలంలో హాజరు పరచిన కోర్ట్ కానిస్టేబుల్ మోహన్ రెడ్డి, పుంగనూరు కోర్ట్ కానిస్టేబుల్  రవి మరియు కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్  చంద్రశేఖర్ మరియు వారి సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ప్రత్యేకంగా అభినందించారు.
ప్రియుడి మోజులో పడి కూతురిని చంపిన తల్లి.. ఇద్దరికి జీవిత ఖైదు Publish Date: Jul 3, 2025 7:39PM

మరోసారి మోసపోయిన శ్రీవారి భక్తులు

  కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని  తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు. తీరా కొండకు చేరుకున్న తర్వాత పది రోజుల ముందే ఒక వ్యక్తి మొబైల్ నుండి వచ్చిన  తోమాల, అభిషేక సేవా టికెట్లను తమ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే క్రమంలో అవి నకిలీవి అని తేలడంతో విస్తు పోయారు. వెంటనే తిరుమల వన్ టౌన్ పోలీసులకు  ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా మీరు ఎక్కడ నుండి మొబైల్ ట్రాన్సాక్షన్  చేశారో ఆ పరిధి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడంతో చేసేదేమీ లేక తమ వద్ద ఉన్న ఉచిత టైం స్లాట్ దర్శన టోకెన్లతో వెళ్లి స్వామి వారిని  దర్శించుకుని గురువారం వెనుతిరిగారు.  వివరాల్లోకెళితే తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన విజయ్ ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. తన మిత్రుడి ద్వారా బాలాజీ అనే వ్యక్తి నంబరు పొందాడు. బాలాజి మీకు కోరిన దర్శనం చేయిస్తాడని చెప్పడంతో అతనిని సంప్రదించి దపదపాలుగా బాలాజీ అకౌంట్ నెంబర్ కు రూ. 65 పంపాడు. అందుకు పది రోజుల క్రితం విజయ్ కుటుంబ సభ్యులు ఐదు మంది పేర్లతో టీటీడీ లోగో కలిగిన నకిలీ తో మాల సేవ టికెట్టును 03-07-2025 తేదికి, మరుసటి రోజు 04-07-2025 తేదీ శుక్రవారం రోజుకి 6 మందికి కలిపి ఒక నకిలీ టికెట్టును అనుమానం రాకుండా నెట్ లో తయారు చేయించి విజయ్ మొబైల్ కు పంపాడు. అలాగే ఒక సూట్ రూమ్ కు కూడా వారి పేరుతో   నకిలీ రసీదు ను పంపాడు. వారు స్వామివారు మనకు మంచి సేవలు ఇచ్చారు అనే ఆనందం లో బుధవారం  తిరుమలకు చేరుకున్నారు.  ఎందుకైనా మంచిదే అని తిరుపతిలో ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు పొందారు. తీరా  మీరు మాకు బుక్ చేసిన గదిని పొందేందుకు ఎక్కడికి వెళ్లాలని అడిగేందుకు బాలాజీకి ఫోన్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోగా మెసేజ్ లకూ స్పందించలేదు. దాంతో అనుమానం కలిగి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. రిఫరెన్స్ అనేది టికెట్ పైన లేకుండా దర్శనం టికెట్టు మంజూరు కాదు. ఎంతటి వి.వి.ఐపీ లు అయినా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారే స్వయంగా వస్తే తోమాల సేవను  ఒకరికి లేక ఇద్దరికీ మంజూరు చేస్తారు. అలాగే పూరాభిషేకం కూడా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నవారికి ఒక్కటి లేక రెండు మంజూరు చేస్తారు.  ఇలా ఎలా మోసపోయారని తిరుమల పోలీసులు బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దళారీలు మాత్రం శ్రీవారి భక్తులను మోసం చేసేందుకు రక రకాల కొత్త మార్గాలను ఉపయోగించి దోచేస్తున్నారు. ఇటువంటి మోసాలపై ఇటు టీటీడీ, అటు పోలీసులు బయట వ్యక్తులను నమ్మకండి... టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని పదే పదే కోరుతున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలతో భక్తులు మోసపోతూనే ఉన్నారు. కాగా నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేసిన బాలాజీ బ్యాంక్ అకౌంట్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్నట్లు బాధిత భక్తుడు విజయ్ తెలిపారు.
మరోసారి మోసపోయిన శ్రీవారి భక్తులు Publish Date: Jul 3, 2025 6:48PM

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం

  హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్, పాశమైలారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. యాజమానుల నిర్లక్ష్యం జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం Publish Date: Jul 3, 2025 5:23PM

పతంజలికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

  ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. డాబర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు, పతంజలి ప్రకటనలు నిరాధారమైనవని పేర్కొంది. డాబర్ రూ. 2 కోట్లు పరిహారం కోరింది. పతంజలి సంస్థ తమ ఉత్పత్తుల్లో ఎక్కువ ప్రజాదరణ కలిగిన ఒకదాని గురించి అవమానకరమైన ప్రకటనలను నిర్వహిస్తోందని ఆరోపిస్తూ డాబర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మినీ పుష్కర్ణ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.  ఆయుర్వేద, శాస్త్రీయ గ్రంథాల ఆధారంగా చ్యవన్‌ప్రాష్‌ను తయారు చేసిన ఏకైక సంస్థ తమదేనని, డాబర్ వంటి ఇతర బ్రాండ్‌లకు ప్రామాణికమైన జ్ఞానం లేదని, అవెలా తయారు చేయగలవని యాడ్స్‌ను పతంజలి రూపొందించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పతంజలి తమ ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణం వాటిని నిలిపివేయాలని ఆదేశాలివ్వాలని కోరింది. తాము మార్గదర్శకాలను అనుసరించే ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, పతంజలి రూపొందించిన యాడ్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వివరించింది.దీనిపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పతంజలి యాడ్స్‌ను తక్షణం నిలిపేయాలని, తదుపరి విచారణ జూలై 14కి వాయిదా వేసింది.
పతంజలికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు Publish Date: Jul 3, 2025 4:53PM

అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

  అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు అంగన్వాడీ సహాయకుల నుంచి టీచర్లుగా పదోన్నతి పొందాలంటే గరిష్ఠ వయసు 45 ఏళ్లుగా ఉండేది. తాజాగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ నిబంధనను సవరించి, వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచింది. ఈ మార్పునకు సంబంధించిన ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క  సంతకం చేసి ఆమోదం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలంగాణ వ్యాప్తంగా పని చేస్తున్న 4,322 మంది అంగన్వాడీ సహాయకులకు ప్రయోజనం కల్గునుంది. కాగా ఇటీవల అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త Publish Date: Jul 3, 2025 4:39PM

పెళ్లయిన పది రోజులకే ఫుట్‌బాల్ ప్లేయర్ దుర్మరణం

  పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్పెయిన్ సనాబ్రియాలో సోదరుడితో కలిసి లంబోర్గిని కారులో ప్రయాణిస్తున్న సమయంలో టైరు పేలి అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. 10 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న జోటా, స్పెయిన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. జూన్ 22న తన ప్రేయసి రూట్ కార్డోసోను జోటా వివాహం చేసుకున్నాడు. వారికి పెళ్లికి ముందే ముగ్గురు పిల్లలు ఉన్నారు.  ఈ యాక్సిడెంట్ జరగడానికి కేవలం కొన్ని గంటల ముందే, "ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం" అనే క్యాప్షన్‌తో తన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. పోర్చుగల్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన జోటా, 2020 సెప్టెంబర్‌లో లివర్‌పూల్ క్లబ్‌లో చేరాడు. గత మే నెలలోనే లివర్‌పూల్ జట్టుతో కలిసి ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 
పెళ్లయిన పది రోజులకే ఫుట్‌బాల్ ప్లేయర్ దుర్మరణం Publish Date: Jul 3, 2025 3:59PM

హరిహర వీరమల్లు ట్రైలర్...ద్వారా మనకేం తెలుస్తోంది?

  పవన్ కళ్యాణ్‌ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి. వినిపించాయి. అంతే కాదు, కోహినూర్, ఔరంగజేబ్ వంటి ఆనవాళ్లతో హర హర మహదేవ్ అనే బీజింగ్ మధ్య.. ఈ ట్రైలర్ డెడికేటెడ్ టూ హిందూస్ అన్నది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇక ధర్మానికి సంబంధించిన టెక్స్ట్ కూడా ప్లే కావడం చూస్తుంటే సనాతన ధర్మం పవన్ కేవలం తన పొలిటికల్ ఎజెండా మాత్రమే కాకుండా.. దాన్ని సినిమాల ద్వారా కూడా వ్యాప్తి చెందించే యత్నంగా భావిస్తున్నారు. గతంలో  మోడీ బాలీవుడ్ మొత్తాన్ని పిలిచి.. ఇప్పటి వరకూ చరిత్రలో మరుగున పడ్డ హిందూ అన్ సంగ్ హీరోలు, వారికి సంబంధించిన అన్ టోల్డ్ స్టోరీలు తీయమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ వంటి వారు తప్ప.. మిగిలిన హీరోల్లో చాలా మంది ముస్లిములు ఉండటం వల్ల ఏమంత ఎక్కువగా ఈ తరహా  సినిమాలు రావడం లేదు. వచ్చినా అవి చావా రేంజ్ లో జనాల్లోకి వెళ్లడం లేదు.  అయితే పవన్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా ఉండటం వల్ల.. అందునా బీజేపీతో టై- అప్ అయి ఉండటం వల్ల.. ఆయనకంటూ ఒక వెసలుబాటు ఏర్పడింది. ఇప్పటికే ఆయన తెరబయట కూడా సనాతన ధర్మ వారధిగా విశేషంగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. మొన్నటికి మొన్న- తమిళనాడు మురుగన్ మానాడులో ఆయన మత ప్రసంగాలపై క్రిమినల్ కేసులు కూడా తోడయ్యాయి. ఈ క్రమంలో ఆయన తగ్గుతాడనుకుంటే.. హరి హర వీరమల్లు వంటి చిత్రాలతో మరింతగా చెలరేగేలా తెలుస్తోంది. అంతేనా ఈ పార్ట్ 1లో కత్తికి- దెయ్యానికీ మధ్య యుద్ధం అన్న అర్ధమొచ్చేలా 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అన్న కలరింగ్ ఇస్తున్నారు. అంటే రెండో పార్టు కూడా అంతే స్థాయిలో హిందుత్వ భావజాల వ్యాప్తి ఉండేలా కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్‌ పూర్తి హిందుత్వం పుణికి పుచ్చుకున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు!  
హరిహర వీరమల్లు ట్రైలర్...ద్వారా మనకేం తెలుస్తోంది? Publish Date: Jul 3, 2025 3:28PM

మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగాల కోత..ఏఐ ప్రభావంతో లేఆఫ్స్

  ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది. కొద్ది నెలల వ్యవధిలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను  తొలగిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా 2019లో మొదలైన ఈ కోతలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి.. మరోవైపు, దాదాపు 9 వేల మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌లు ఇవ్వనున్నట్లు కొన్ని వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.  జూన్ 2024 నాటి గణాంకాల ప్రకారం, మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో సుమారు 6 వేల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. తాజా లేఆఫ్‌ల కారణంగా దాదాపు 9,100 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటున టెకీలు గొప్పలకు పోయి వృధాగా ఖర్చు పెట్టొద్దని మిడతల్లా అందుబాటు లో ఉన్నది మొత్తం తినేయడం కాదని నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లు తెలుగోళ్లు సాఫ్ట్వేర్ ఉంటారు. ఇంకా వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఉంటే బ్లూ కాలర్ పనులకోసం బీహార్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్ ఇంకా ఈశాన్య రాష్ట్రాల వారు మన రాష్ట్రాని వస్తున్నారు. బతుకు తెరువు కోసం తెలుగు వారు బ్లూ కాలర్ ఉద్యోగాలు చేయాల్సిన కాలం ఎంతో దూరంలో లేదని నిపుణులు భావిస్తున్నారు.  
మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగాల కోత..ఏఐ ప్రభావంతో లేఆఫ్స్ Publish Date: Jul 3, 2025 3:18PM

పరదాలు పోయి.. పాదయాత్ర అంటున్న జగన్

మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. సుదీర్ఘ పాదయాత్రతోనే గతంలో అధికారంలోకి వచ్చానని నమ్ముతున్న ఆయన తిరిగి  పాదయాత్రతోనే అధికారంలో రావాలని భావిస్తున్నారు. మొత్తానికి పరదాల మాటు సీఎం  అనిపించుకున్న జగన్ ఇప్పుడు పాదయాత్రం అంటుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మరోసారి పాదయాత్ర చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని.. అవసరం అయితే, మరోసారి పాదయాత్ర చేస్తానని  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తాజాగా జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్‌.  జగన్ పాదయాత్ర ప్రకటనతో మరోసారి ఏపీలో పాదయాత్రలపై ఆసక్తికర చర్చ మొదలైంది.  జగన్‌కు పాదయాత్ర కొత్త ఏమీ కాదు. 2019లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రతోనే ఏపీలో తిరుగులేని విజయాన్ని సాధించామని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. 2029 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర చేయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. పాదయాత్ర కంటే ముందే జగన్ జిల్లాల పర్యటనలు కూడా చేస్తానంటున్నారు.  వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే జగన్ జిల్లా పర్యటనలు చేస్తానని ప్రకటించారు. ఆయా జిల్లాల్లో రెండు రోజులు నిద్ర చేస్తానని కూడా చెప్పారు. అయితే ఆ  పర్యటనల షెడ్యూల్ ఇంత వరకు ప్రకటించనే లేదు. ఈ సారి కూడా తన పర్యటనలు ఎప్పటి నుంచి ఉంటాయో అయన వెల్లడించలేదు.  అదలా ఉంటే.. అధికారంలో ఉన్నంత కాలం బయటకొస్తే పరదాల మాటున పాలన కొనసాగించిన జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటుండటంపై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా జనంలోకి రావడానికి సంకోచిస్తున్నట్లు పరదాల మాటునే గడిసేసిన ఆయన పాదయాత్ర అంటుండటంతో.. పరదాలు పోయి, పాదయాత్ర వచ్చిందని నెటిజన్లు  ఎద్దేవా చేస్తున్నారు. పవర్ పోగానే ప్రజల్లోకి వస్తానంటుండటంతో అప్పుడు జనం గుర్తుకు రాలేదా అన్న విమర్శలు రీసౌండ్ ఇస్తున్నాయి.
 పరదాలు పోయి.. పాదయాత్ర అంటున్న జగన్ Publish Date: Jul 3, 2025 2:55PM

బీసీ రిజర్వేషన్లుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలి : ఎమ్మెల్సీ కవిత

  తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్‌ రోకోకు  ఆమె  పిలుపునిచ్చారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు ముందడుగు వేయలేదని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కవిత స్పష్టం చేశారు. జూలై 8 లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి  ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీ బిల్లు విషయంమై బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి లేఖ రాస్తున్నామని తెలిపారు.  బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలని, ఈ విషయమై ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు లేఖ రాశామని చెప్పారు. ఆయన చొరవ తీసుకోని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్‌లో ఎన్నడూ మాట్లాడలేదని మండిపడ్డారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తున్నదని విమర్శించారు.   
బీసీ రిజర్వేషన్లుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలి : ఎమ్మెల్సీ కవిత Publish Date: Jul 3, 2025 2:39PM

శిద్దా ఫ్యామిలీ పొలిటికల్ గా ఇక తెరమరుగేనా?

మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.  దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి ఏడాదిగా ఏ పార్టీలో చేరలేకపోతున్నారు. దాంతో ఆయనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడింది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఫొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా  చర్చ జరుగుతోంది. తెలుగుదేశంలో కీలక నేతగా పలు పదవులను అలంకరించిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండా తయారయ్యారు. గడిచిన సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సి అనివార్య పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేత గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధా రాఘవరావు రాజకీయ జీవితం  డైలమాలో పడటానికి కారణం స్వయంకృతాపరాధమే అంటున్నారు. వ్యాపార వేత్తగా ఉన్న సిద్ధా రాఘవరావు 1999లో తెలుగుదేశంలో చేరగానే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో శిద్దా పరాజయం పాలయ్యారు. అయినా శిద్దా రాఘవరావును శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమించి చంద్రాబాబు సముచిత గౌరవం ఇచ్చారు. అనంతరం 2007లో ఎమ్మెల్సీగాను అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అక్కడ విజయం సాధించిన రాఘవరావుకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలు కేటాయించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు సైకిల్ దిగి ప్యాన్ గూటికి చేరారు.  అయితే వైసీపీలో చేరిన శిద్దాకు అక్కడ కనీస ప్రాధాన్యత కూడా లభించలేదు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అంతా తానై శాసించిన రాఘవరావుకు వైసీపీ లో ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా..  2024 ఎన్నికల్లో ఎక్కడా సీటు కూడా కేటాయించలేదు. ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన శిద్ధా రాఘవరావు గడిసిన సంవత్సర కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండి పోయారు. అయితే ఆయన అనుచరగణం మాత్రం ఆయన టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం   చేసుకుంటున్నారంట. మరో వర్గం మాత్రం కష్టకాలంలో పార్టీ వీడి పోయిన వారిని ఎవరినీ పార్టీలో చేర్చుకోవద్దని లోకేష్ చెప్పారని.. శిద్దా రాఘవరావు ను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లాలో మాత్రం టీడీపీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన శిద్దా వైసీపీకి వెళ్ళి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది. రాఘవరావుతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం అయ్యిందట. శిద్దా రాఘవరావు తన కుమారుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు బాగానే ప్రయత్నాలు చేశారంట. టీడీపీలో మంత్రిగా శిద్దా కొనసాగుతున్న సమయంలో ఆయన పోటీచేసి విజయం సాధించిన దర్శి నియోజకవర్గంలో సిద్ధా సుధీర్  పెత్తనమే కొనసాగింది. 2019 ఎన్నికల్లో తాను ఒంగోలు ఎంపీగా పోటీచేస్తూ తన కుమారుడికి దర్శి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారట. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల తర్వాత వ్యాపార వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వం కల్పించిన చిక్కుల నుండి బయట పడేందుకు శిద్దా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత వైసీపీకి రిజైన్ చేసి, టీడీపీలో చేరే అవకాశం లేకుండా పోయిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు.  దీంతో ఆయనతో పాటు సిద్దా సుధీర్ రాజకీయ భవిష్యత్ కూడా డోలాయమానంలో పడింది.   2014 నుండి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న శిద్దా కుటుంబం ఇప్పుడు ఇంటికే పరిమితం కావటంతో సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై  నీలి నీడలు కమ్ముకున్నాయి. 2024 ఎన్నికల ముందు కూడా  రాఘవరావుకు తెలుగుదేశంలో చేరే అవకాశం వచ్చిందట. అయితే అప్పట్లో ఆయన అప్పట్లో ససేమిరా అన్నారంట. చేజేతులా చేసుకున్న దానికి   ఇప్పుడు అనుభవి స్తున్నారని టీడీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.
శిద్దా ఫ్యామిలీ పొలిటికల్ గా ఇక తెరమరుగేనా? Publish Date: Jul 3, 2025 2:12PM

జగన్ తో వంశీ భేటీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు  వల్లభనేని వంశీ  ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు. జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే  తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ..  కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్.. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. ఇలా ఉండగా వంశీ వైసీపీకిగుడ్ బై చెప్పనున్నారనీ, రాజకీయాలకు దూరం కావాలనుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  
జగన్ తో వంశీ భేటీ Publish Date: Jul 3, 2025 1:53PM

సిగాచీ షేర్లు ఢ‌మాల్!

పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత  ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతన‌మ‌య్యాయి.  3 రోజుల్లోనే  దాదాపు 24 శాతం షేర్ వాల్యూ ప‌డిపోయింది.  ఒక్కొక షేర్ పై దాదాపుగా రూ.14 నష్టం వచ్చింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడం, ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కార్మికులు, కంపెనీ సిబ్బంది మృత్యువాత పడటం తెలిసిందే. ఈ సంఘటన తరువాత ఆ కంపెనీ షేర్ వాల్యూ స్టాక్ మార్కెట్ లో బారీగా పతనమైంది.  దీంతో  సిగాచి ఇండస్ట్రీస్ సంస్థ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తమ పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపిన ప్రమాదం పై నేషనల్  స్టాక్ ఎక్స్చేంజ్ కి లేఖ రాసింది.  పాశమైలారం సిగాచీ ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదంలో  మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది.   ప్రమాదనికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందనీ, హైదరాబాద్ ప్లాంట్ లో మూడు నెలలపాటు   కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  దేశ వ్యాప్తంగా  సిగాచీకి  నాలుగు పరిశ్రమలున్నాయి. పాశమైలారంతో పాటు సుల్తాన్ పూర్, కర్ణాటకలోని రాయచూర్, గుజరాత్ లోని జగడియ, ధహేజ్ లలో మొత్తం 4 పరిశ్రమలు నడుస్తున్నాయి. సంస్థ‌కు వేల కోట్ల మార్కెట్ వాల్యూ ఉంది.  సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ  1989లో సిగాచి క్లోరో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది.  2012లో వాణిజ్యపరంగా విస్తరించేందుకు సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. 2019లో స్టాక్ మార్కెట్ లో  లిస్ట్ కావడంతో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ప్రస్తుతం  ఈ ఇండ‌స్ట్రీకి సుమారుగా రూ.1680 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న‌ట్టు చెబుత‌న్నాయి కంపెనీ గ‌ణాంకాలు. ఈ కంపెనీ ఫార్మా రంగంలో ముడి సరుకు సహాయ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రమాదం జరిగిన పాశమైలారం యూనిట్లో- మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ పౌడర్ అనే ప్రొడక్ట్ ని తయారు చేస్తోంది. వీటితోపాటు యాక్టివ్ ఫార్మాస్యుటికల్ ఇంగ్రిడియంట్స్ ను  తయారు చేస్తోంది. ఇది బైండింగ్ మెటీరియల్ గా ఉపయోగపడుతుంది.  డ్రగ్ తయారీలో ఈ ఔషధాన్ని ఉపయోగించి మనం నిత్యం వినియోగించే ఔషధాలు తయారు చేస్తారు.  ఏడాదికి ఈ ఒక్క ప్లాంట్ ద్వారానే 6 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఎండీ క‌మ్  సీఈవోగా అమిత్ రాజ్  సిన్హా, చైర్మన్ గా రవీంద్ర ప్రసాద్ సిన్హా, వైస్ చైర్మన్ గా చిదంబరనాథన్  ఉన్నారు.  ప్రమాదం జరిగిన పాశమైలారం సిగాచి ప్లాంటు కార్యకలాపాలన్నీ వైస్  చైర్మన్ చిదంబరనాథన్ అధ్వ‌ర్యంలో జరుగుతాయని చెబుతున్నారు.
సిగాచీ షేర్లు ఢ‌మాల్! Publish Date: Jul 3, 2025 12:25PM

ఎలాన్ మ‌స్క్ యూటర్న్.. సొంత పార్టీ లేనట్టేగా?

ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్ర‌పంచంలో ఉన్న ఎన్నో వివాదాలను ప‌రిష్కరించారు.  ఆయ‌న‌కా క్రెడిట్ ద‌క్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మ‌స్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్ద‌రూ ఇపుడు కలిసిపోయారా? ఆల్ ఆఫ్ ఏ స‌డెన్ గా ఎలాన్ మస్క్ ట్రంప్ ను పొగుడుతూ కామెంట్ చేయడమేంటి? అన్న ప్రశ్నలు జనబాహుల్యం నుంచి ఉత్పన్నమౌతున్నాయి.   నిజానికైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయిన వెంట‌నే తాను ద అమెరికా పార్టీ  స్థాపించడం తథ్యమని మస్క్ తెగేసి చెప్పారు.  ఈ లోగా ట్రంప్ ఒక కామెంట్ చేశారు. అస‌లు మ‌స్క్ త‌న పెట్టేబేడా స‌ర్దుకుని సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంటుంది. మేము ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు అన్నేసి స‌బ్సిడీల‌ను ఇచ్చామ‌ని బాంబు పేల్చారు ట్రంప్. దెబ్బ‌కు జ‌డుసుకున్న మ‌స్క్ ట్రంప్ ని వెన‌కేసుకొచ్చారు. క్రెడిట్ ఇవ్వాల్సిన  చోట ఇవ్వాల్సిందే అన్నారు. ఇజ్రాయెల్ గాజాలో అర‌వై రోజుల కాల్పుల విర‌మ‌ణ‌కు ఒప్పుకుంద‌ని ట్రంప్ ప్ర‌క‌టించిన వెంట‌నే ఆయ‌నీ ట్వీట్ పోస్ట్ చేశారు. ట్రంప్- మ‌స్క్ స్నేహ బంధం 2016 నాటిది. వీరిద్ద‌రూ ఈ తొమ్మిదేళ్ల‌లో ఎన్నో సార్లు విడిపోయి, క‌లిసిపోయిన చ‌రిత్ర ఉంది. వీరిద్ద‌రి గ‌రించి ద గార్డియ‌న్ ప‌త్రిక 2024లో  ఇద్ద‌రు సంప‌న్న మిత్రుల మ‌ధ్య గాఢ ప్రేమానుబంధంగా అభివ‌ర్ణిస్తూ ఓ వ్యాసం ప్రచురించింది. మ‌స్క్ కి ట్రంప్ కి ఉన్న గాఢ స్నేహానుబంధం ఎలాంటిదంటే.. ట్రంప్ ఒక ద‌శ‌లో ట్విట్ట‌ర్ ఖాతాను కోల్పోయారు. దీంతో ఆయ‌న జోబైడెన్ చేతుల్లో ఓడి పోవ‌ల్సి వ‌చ్చిందప్ప‌ట్లో. అయితే గ‌త ఎన్నిక‌ల నాటికి అదే ట్విట్ట‌ర్ ని కొని దానికి ఎక్స్ అన్న నామ‌క‌ర‌ణం చేసి.. దానిలోని ట్రంప్ ఖాతాను రీ- జ‌న‌రేట్ చేశారు మ‌స్క్.  అంతేనా.. డెమోక్రాటిక్ అభ్యర్థి క‌మ‌లా హారిస్ మీద విరుచుకుప‌డ్డారు  కూడా.   ఆ ఎన్నికలపై ఇది తీవ్ర ప్ర‌భావం చూపించింది.   ఎట్ట‌కేల‌కు గెలిచాం కదా అనుకుంటే ట్రంప్ నుంచి మస్క్ కు ఆశించినంత  సాయం అందలేదు. ఎన్నో విష‌యాల్లో ట్రంప్ మ‌స్క్ కి మ‌స్కా కొట్టారు. ఇస్తాన‌న్న‌వేవీ ఇవ్వ‌క పోగా.. మ‌స్క్ కి ప‌బ్లిక్ లో తీవ్ర వ్య‌తిరేక‌త కొట్టొచ్చిన‌ట్ట క‌నిపించింది. డోజ్ ద్వారా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌కు నిర‌స‌న‌గా.. త‌న టెస్లా షోరూములు ధ్వంసం కావ‌డం..  ఆపై షేర్ల ధ‌ర‌లు ప‌డిపోవ‌డం  అటుంచితే..  త‌న సంప‌ద వంద బిలియ‌న్ డాల‌ర్ల మేర ఆవిర‌య్యింది. అంతేనా త‌న మిత్రుడిని నాసా చీఫ్ చేస్తాన‌న్న మాట కూడా మ‌రిచారు ట్రంప్.  ప్ర‌శాంతంగా కొత్త కొత్త ఐడియాల‌తో బిజినెస్ చేసుకోకుండా.. అన‌వ‌స‌రంగా విరాళ‌మిచ్చి మ‌రీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఇలాంటి వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకోవ‌డం అవ‌స‌ర‌మా? అంటారు మస్క్ తండ్రి   ఎరోల్ మ‌స్క్.  ప్ర‌స్తుతం మావాడికేం పెద్ద వ‌య‌సు అయిపోలేద‌నీ.. న్యూరాలింక్ అనే కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడ‌నీ.. అదిగానీ క్లిక్ అయితే ద‌శ తిరిగిపోతుంద‌ని అంటారాయ‌న‌. కార‌ణం మస్క్ కొత్త ప్రాజెక్టు వెన్నుముక విరిగిన వారికి సంసార జీవితం, కంటి చూపులేని వారికి చూపు ప్ర‌సాదించే దివ్య ఔష‌ధం. అలాంటి ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ అయితే పోయిన సంప‌ద‌ అంతకు అంతగా మారి తిరిగి వ‌స్తుంది. ప్ర‌స్తుతం మ‌స్క్ వ‌య‌సు 53 ఏళ్లు కాగా.. సంప‌ద విలువ 300 బిలియ‌న్ డాల‌ర్లు. ట్రంప్ లా లాస్ట్ స్టేజ్ లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ నెట్ ప్రాక్టీస్ గా ప‌డి ఉంటుంది లెమ్మ‌ని.. కాస్త ఎర్లీగానే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన మ‌స్క్.. ఆల్ ఆఫ్ ఏ స‌డెన్ గా పార్టీ పెట్టేస్తా అన‌గానే అంద‌రూ షాక‌య్యారు. ఇప్పుడు చూస్తే పార్టీ లేదూ గీర్టీ లేదు తూచ్ అంటున్నారు. మ‌రి చూడాలి. ట్రంప్ తో ఈ చెలిమి కంటిన్యూ అవుతుందా లేక ఇద్ద‌రి మ‌ధ్యా మళ్లీ వివాదం మ‌రింత ముదిరి.. కొత్త పార్టీకి దారి తీస్తుందా? తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడ‌క త‌ప్ప‌దు.
ఎలాన్ మ‌స్క్ యూటర్న్.. సొంత పార్టీ లేనట్టేగా? Publish Date: Jul 3, 2025 11:18AM