మ్యావ్ అన్న ‘బొబ్బిలిపులి’
posted on Jul 1, 2015 10:13PM

మొన్నటి వరకూ గాండ్రించిన ‘బొబ్బిలిపులి’ ఇప్పుడు మ్యావ్ అంటూ వినయాన్ని ప్రకటిస్తోంది. ఇంతకీ ‘బొబ్బిలిపులి’ అంటే ఇదేదో బొగ్గు కుంభకోణంలో ఇరుక్కుపోయిన దాసరి నారాయణరావుకు సంబంధించిన మేటర్ అనుకోకండి.. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుకు సంబంధించిన మేటర్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుజయ కృష్ణ గత కొంతకాలంగా పార్టీ నాయకత్వం మీద ఆగ్రహంగా వున్నారు. అప్పట్లో బొత్స సత్యనారాయణను పార్టీలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆయన ఆగ్రహం ప్రారంభమైంది. బొత్స అంటే తనకు ఎంతమాత్రం పడదని, ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన బెదిరించారు. ఆయన ఎంత బెదిరించినా పార్టీ నాయకత్వం ఎంతమాత్రం పట్టించుకోలేదు. తమ ఎమ్మెల్యే మాటలను పెడచెవిన పెట్టి మరీ బొత్సని పార్టీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి సుజయ కృష్ణ ఆగ్రహంతో గాండ్రిస్తున్నారు. నేడో రేపో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని అందరూ అనుకున్నారు. వైసీపీలోని నాయకులు చాలామంది ఈ పరిణామం జరగటం ఖాయమని ఫిక్సయిపోయారు. సుజయ కృష్ణ అనుచరులందరూ పార్టీకి గుడ్ బై చెప్పాల్సిందేనని ఫిక్సయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పార్టీ అధ్యక్షుడు జగన్ పిలిపించి చర్చలు జరిపారు. జగన్ని కలసినప్పుడు సుజయ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని, పులిలా గాండ్రిస్తారని అందరూ అనుకున్నారు. అయితే జగన్ని కలిసి బయటకి వచ్చిన తర్వాత ఆయన తాను వైసీపీని వీడబోనంటూ పిల్లిలా మ్యావ్ అన్నారు. సుజయ్ ప్రదర్శించిన ఈ ధోరణి ఆయన అనుచరులకే నచ్చడం లేదు.