Latest News
విద్యార్థికి శిరోముండనం.. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపాల్ నిర్వాకం!
posted on: Mar 9, 2026 3:15PM

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఓ విద్యార్థికి శిరోముండనం చేయడం తీవ్ర వివాదంగా మారింది. తమ కుమారుడికి జుట్టు ఎక్కువగా ఉందన్న కారణంతో పాఠశాల ప్రిన్సిపాల్ శిరోముండనం చేయించారంటూ ఆ విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మియాపూర్ హఫీజ్‌పేట్ పరిధిలోని ప్రేమ్‌నగర్ బి బ్లాక్‌లో ఉన్న “బ్లాక్ బోర్డు ది స్కూల్”లో ఈ ఘటన చోటుచేసుకుంది
ఈ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఈశ్వర్ అనే విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉందని స్కూల్ ప్రిన్సిపాల్ జుట్టు తగ్గించుకోవాలని, హెయిర్ కటింగ్ చేయించుకోవాలని పలుమార్లు హెచ్చరించారు. అయితే మొక్కు కారణంగా జుట్టు ఇప్పుడు కత్తిరించలేమని ఈశ్వర్ తల్లిదండ్రులు ప్రిన్స్ పాల్ కు చెప్పారు. అయితే ఆ మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన విద్యార్థికి ప్రిన్సిపాల్ బల వంతంగా శిరోముండనం చేయించారు. ఈ విష యం తెలిసిన వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు భారీ సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళ నకు దిగారు.
తమ కుమా రుడి మనోభావాలను పట్టించుకోకుండా ఇలా చేయడం తగదని వారు మండిపడ్డారు. పాఠశాల యాజమాన్యం చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న స్థానికులు కూడా పాఠశాల వద్దకు చేరుకుని జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాల యాజమాన్యం మాత్రం తమ నిబంధనల ప్రకారం విద్యార్థులకు క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు.అయితే మొక్కు ఉన్నదని తల్లిదండ్రులు చెప్పినా విద్యార్థికి గుండు కొట్టించిన వ్యవహారంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది.






