శివరాత్రి.. స్పెషల్ బస్సులకూ స్త్రీ శక్తి పథకం వర్తింపు

posted on: Feb 10, 2026 8:32AM

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మహిళలకు స్పెషల్ బస్సులలోనూ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ కొన్ని సర్వీసులలో ఉచిత ప్రయాణం పథకం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మామూలుగా అయితే ఇటువంటి స్పెషల్ బస్సులకు స్త్రీ శక్తి పథకం వర్తించదు.

అయితే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవ క్షేత్రాలను ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యక బస్సులకూ స్త్రీశక్తి పథకాన్ని విస్తరించింది. అంటే శివరాత్రి సందర్భంగా శైవక్షాత్రాలను దర్శించుకునే మహిళలు ప్రత్యేక బస్సులలో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ’ఈ నెల 15న శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.  ఈ ప్రత్యేక బస్సులలో కూడా   మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. 

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం మొత్తం 618 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 70 బస్సులను నడుపుతున్నామన్నారు.   నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, చీరాల డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం పెట్లూరివారిపాలెం వద్ద ప్రత్యేకంగా ఆర్టీసీ క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.  అలాగే  శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలోని ఐదు డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.   ఈ ప్రత్యేక బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...