Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశ ప్రయోజనాలే పరమావధిగా గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక దౌత్యం
posted on: Apr 24, 2026 5:51PM

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన వ్యూహాత్మక దౌత్యానికి పదును పెట్టింది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు, గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద రవాణా ఇబ్బందులు, ఎర్రసముద్రం ప్రాంతంలో నౌకలపై దాడులు వంటి అంశాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. భారత్ తన అవసరాలకు కావాల్సిన చమురు, సహజ వాయువులో 60 శాతానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. సరఫరా గొలుసు దెబ్బతింటే అది దేశీయంగా ద్రవ్యోల్బణానికి, ఆర్థిక మందగమనానికి దారితీస్తుందని కేంద్రం ఆందోళన చెందుతోంది. అందుకే గల్ఫ్ దేశాలతో సంబంధాలను కేవలం వాణిజ్య పరంగానే కాకుండా, జాతీయ భద్రతా కోణంలోనూ భారత్ పటిష్టం చేసుకుంటోంది.అజిత్ దోవల్ ఈ నెల సౌదీ అరేబియా పర్యటన ఈ కోవలోనిదే. ఈ పర్యటనలో భాగంగా ఆయన రియాద్ లో సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సల్మాన్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు ముసాయిద్ అల్-ఐబాన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు సముద్ర రవాణా భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఈ పర్యటనను భారత విదేశాంగ శాఖ వ్యూహాత్మక) పర్యటనగా అభివర్ణించడమే దీని ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
సౌదీ అరేబియా భారత్‌కు మొదటి మూడు ప్రధాన చమురు సరఫరాదారుల్లో ఒకటి. అంతే కాకుండా ఇక్కడ దాదాపు 40 లక్షల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు, సౌదీ-పాకిస్థాన్ రక్షణ ఒప్పందాల వంటి అంశాల నేపథ్యంలో భారత్ కు చమురు ధరలతో పాటు, అక్కడి ప్రవాస భారతీయుల భద్రత అత్యంత ప్రాధానం. ఈ నేపథ్యంలోనే అజిత్ దోవల్ రియాద్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక మరోవైపు, విదేశాంగ మంత్రి జైశంకర్ యూఏఈ పర్యటన కూడా ఇదే వ్యూహంలో భాగంగా చెప్పాలి. గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన యూఏఈ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక భాగస్వామిగా ఉంది. అదేవి ధంగా, ఖతార్ పర్యటన ద్వారా ఎల్‌ఎన్‌జీ , ఎల్‌పీజీ ( సరఫరాపై పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి దృష్టి సారించారు. గ్యాస్ ఒప్పందాలు దీర్ఘకాలం పాటు కొనసాగేలా, ధరల్లో స్థిరత్వం ఉండేలా చూడటం ద్వారా భారత పారిశ్రామిక రంగానికి భరోసా కల్పించడం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం.భారత్ ఇప్పుడు ప్రాక్టికల్ డిప్లొమసీ ని అవలంబిస్తోంది. భావోద్వేగాలకు తావులేకుండా, దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తోంది. ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా విభిన్న వనరుల నుంచి ఇంధనాన్ని సేకరించడం ద్వారా ముప్పును తగ్గించుకోవాలని చూస్తోంది.
సముద్ర మార్గాల్లో నౌకల ప్రయాణం సురక్షితంగా సాగడం, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరగకుండా చూడటం వంటి అంశాలపై దోవల్ చర్చలు కేంద్రీకృతమయ్యాయి.మొత్తానికి, భారత్ చేపట్టిన ఈ గల్ఫ్ దౌత్యం కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలా ఒక పటిష్టమైన ఇంధన భద్రత వ్యవస్థను నిర్మించే దిశగా వేసిన అడుగుగా చెప్పాలి. ఇంధన భద్రతే జాతీయ భద్రతగా భావిస్తున్నకేంద్రం పశ్చిమ ఆసియాలోని కీలక దేశాలతో తన దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే వ్యూహంతో అడుగులు వేస్తున్నది. రానున్న రోజుల్లో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలు భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి మరింత ఊతమిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
-సీతారాం కంఠంనేని



.webp)


