హోర్ముజ్ జలసంధి మళ్లీ మూత.. ప్రపంచ మార్కెట్లకు ముంచుకొస్తున్న ముప్పు!

posted on: Apr 20, 2026 3:41PM

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. ఇరాన్,  అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు 50రోజులు దాటిన తరుణంలో, వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మరోసారి మూసివేయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇది కేవలం ఒక సముద్ర మార్గం మూసివేత మాత్రమే కాదు, అగ్రరాజ్యం అమెరికాతో సాగిస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఇరాన్ తన ప్రధాన అస్త్రాన్ని ప్రయోగించినట్లు కనిపిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం మూతపడటంతో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. హోర్ముజ్ జలసంధి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుందంటే..  ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం వాటా ఈ సన్నని మార్గం గుండానే వెళ్లాలి. గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే ఎల్.ఎన్.జి  కూడా ఈ దారి ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది.

భౌగోళికంగా ఒకవైపు ఇరాన్, మరోవైపు ఒమన్, యు.ఎ.ఇ సరిహద్దులుగా ఉన్న ఈ జలసంధి..  అరేబియా సముద్రం,  హిందూ మహాసముద్రాన్ని కలిపే ఏకైక ద్వారం. తనపై దాడి జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలనని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తూ..  ఈ జలసంధిని ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటోంది. ఈ విడత మూసివేత వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమవుతోందని రష్యా ముందస్తుగా ఇరాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ తన రక్షణాత్మక వ్యూహాన్ని అమలు చేస్తూ జలసంధిని మూసివేసింది. ఇది ఒక రకంగా నెగోషియేషన్ టేబుల్ వద్ద అమెరికాపై ఒత్తిడి పెంచే బేరసారపు చిప్ అని కూడా చెప్పవచ్చు. 

తమ భూభాగంపై దాడులు జరిగితే, అంతర్జాతీయ ట్యాంకర్ల గమనాన్ని అడ్డుకుంటామనే స్పష్టమైన సందేశాన్ని ఇరాన్ పశ్చిమ దేశాలకు పంపింది. అమెరికా,  ఇజ్రాయెల్ అంచనాలు ఇక్కడ తప్పినట్లు కనిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆ దేశ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, ప్రాంతీయంగా దాని ప్రభావాన్ని తగ్గించాలని ప్రారంభించిన ఈ ఘర్షణ.. ఇప్పుడు బూమరాంగ్ అయ్యింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరగడమే కాకుండా..  రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారమై పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలపైనే పెను ప్రభావం చూపేలా ఉంది. ఈ అనిశ్చితిని రష్యా, చైనా వంటి దేశాలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉన్నందున, నగదును సిద్ధంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి తెరుచుకోవడం లేదా మూసివేయడం అనే అంశం కేవలం భౌగోళిక రాజకీయాలకు సంబంధించింది మాత్రమే కాదు, అది ప్రపంచ ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లను శాసించే అంశంగా మారింది. ఆధునిక ప్రపంచంలో యుద్ధం, దౌత్యం, ఆర్థిక రంగాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయని ఈ సంక్షోభం విస్పష్టంగా నిరూపిస్తోంది. ఇండియా  విషయానికి వస్తే, ఈ పరిణామాలు అత్యంత ఆందోళనకరం. మన దేశం ఇంధన అవసరాల కోసం గల్ఫ్ ప్రాంతంపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. హోర్ముజ్ దిగ్బంధం వల్ల మన ఎనర్జీ సెక్యూరిటీకి ముప్పు వాటిల్లుతుంది. అదే సమయంలో అమెరికా మనల్ని భాగస్వామిగా కోరుతుంటే, మరోవైపు చాబహార్ ఓడరేవు వంటి ప్రాజెక్టుల వల్ల ఇరాన్‌తో మనకు కీలక సంబంధాలు ఉన్నాయి. 

ఇరాన్‌లో అధికార మార్పు వంటి అనిశ్చిత అంశాల కోసం వేచి చూడకుండా, భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఒక సమతుల్యమైన వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ముందు ముందు పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయనేది ఉత్కంఠగా మారింది. ఇరాన్ ఈ జలసంధిని అప్పుడప్పుడు తెరుస్తూ, మళ్లీ షరతులతో మూసివేస్తూ ఒక  ఆన్-ఆఫ్ విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇది షిప్పింగ్ కంపెనీలను, ఇన్సూరెన్స్ సంస్థలను నిరంతర ఆందోళనలో ఉంచుతుంది. ఒకవేళ పొరపాటున ఏదైనా ట్యాంకర్‌పై దాడి జరిగినా లేదా క్షిపణి గురితప్పినా ఇది పెద్ద ఎత్తున  యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. చివరగా, హోర్ముజ్ సంక్షోభం అనేది కేవలం ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోరు కాదు. ఇది మన నిత్యావసర ధరల నుంచి స్టాక్ మార్కెట్ వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే గ్లోబల్ పవర్ గేమ్. ఈ జలసంధి ఎప్పుడు పూర్తిగా తెరుచుకుంటుంది అనే దానికంటే, ఎవరి షరతులకు లోబడి ప్రపంచ దేశాలు ఇక్కడ వ్యాపారం చేయాల్సి వస్తుంది అనేదే అసలు ప్రశ్న. రానున్న రోజుల్లో భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. 

- సీతారాం కంఠంనేని
 

google-ad-img
    Related Sigment News
    • Loading...