ఏనుగుల బెడదకు టెక్నాలజీతో అడ్డుకట్ట!
posted on Nov 4, 2025 8:41AM

ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా సహా పలు ప్రాంతాల్లో రెతులకు పెను కష్టాలను తెచ్చి పెడుతున్న అడవి ఏనుగుల బెడదను నివారించేందుకు ఆధునిక సాంకేతికతను ప్రభుత్వంం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సౌరశక్తి ఆధారంగా పనిచేసే వినూత్న వ్యవస్థను చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. ఈ టెక్నాలజీ ద్వారా ఏనుగుల సంచారాన్ని ముందుగానే గుర్తించి, వాటిని తిరిగి అడవిలోకి పంపించడం సాధ్యమవుతుందన్నారు.
ఈ వ్యవస్థను ఏనుగులు సంచరించే మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. ఇది తన పరిధిలోకి ఏనుగు రాగానే గుర్తించి, వెంటనే తుపాకీ పేలినట్లు పెద్ద శబ్దాలు చేస్తుంది. ఆ శబ్దాలకు భయపడి ఏనుగులు వెనుదిరుగుతాయి. అదే సమయంలో అటవీ శాఖ అధికారులకు వెంటనే సంకేతాలు పంపి, వారిని అప్రమత్తం చేస్తుంది. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన ప్రాంతంలో 60 మీటర్ల పరిధిలో 120 డిగ్రీల కోణంలో నిరంతరం పర్యవేక్షిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ఏనుగుల బెడదకు పరిష్కారం లభించడమే కాకుండా. వన్యప్రాణులకు, మనుషులకు ఎటువంటి హానీ లేకుండా రక్షణ ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. గతంలో ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి నాలుగు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు. గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న అడవి ఏనుగులను ఈ కుంకీలు విజయవంతంగా అడవుల్లోకి మళ్లిస్తున్నాయన్నారు.
ఇప్పుడు వాటికి తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. కుంకీల నుంచి కృత్రిమ మేధ వరకు, ఏనుగుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శనీయంగా నిలుస్తాయని చెప్పారు. ఏనుగుల సంచారాన్నే కాదు.. శేషాచలం అడవులలో చిరుతల కదలికలను కూడా ఈ విధానం ద్వారా గుర్తించవచ్చని చెప్పారు.