రాజధానిపై రభస
posted on: Sep 3, 2014 8:43PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దీర్ఘకాల రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్చించాల్సిన అధికార, ప్రతిపక్షాలు ఒకదానినొకటి విమర్శలు చేసుకొంటున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ దీనిపై శాసనసభలో ఎటువంటి చర్చకు అనుమతించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొంటోందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సభా వ్యవహారాలు తెలియకుండా వ్యవహరిస్తున్నారని, సభలో అజెండాపై చర్చించకపోగా అజెండాను తానే నిర్ణయించాలనుకోవడం అవివేకమని అధికార పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజధాని అంశంపై సభలో ముందు చర్చించిన తరువాతనే ప్రకటన చేయాలని వైకాపా డిమాండ్ చేస్తుంటే, ప్రకటన చేసిన తరువాతనే దానిపై చర్చ జరపాలనే చిన్న విషయం కూడా ప్రతిపక్ష పార్టీకి తెలియదని అధికార పార్టీ సభ్యుల సమాధానం. అధికార పార్టీ ఇందులో తన ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటోంది తప్ప దీర్ఘకాల రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని వైకాపా ఆరోపిస్తుంటే, వైకాపా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని తెదేపా సభ్యుల ఆరోపణ.
ఈ విధంగా అధికార ప్రతిపక్షాల సభ్యులు ప్రకటనకు ముందు చర్చ జరగాలా లేక తరువాత జరగాలా అనే దానిపై తీవ్రంగా వాదోపవాదాలు చేసుకొన్నారు తప్ప రాజధాని ఏర్పాటుపై జరగవలసిన అసలు చర్చ జరపకుండానే సభలో నుండి బయటపడ్డారు. వారి ఈ ఆరోపణ ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శల మధ్య అసలు విషయం కనబడకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సభలో రాజధాని అంశంపై ఒక ప్రకటన చేసేవరకు కూడా బహుశః సభలో ఈ రభస కొనసాగినా ఆశ్చర్యం లేదు. కనీసం ముఖ్యమంత్రి ప్రకటన తరువాతయినా సభలో దీనిపై అర్ధవంతమయిన చర్చ జరిగితే చూసి తరించాలని ప్రజలు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వారిది అత్యాశేమీ కాదు కదా!



.jpg)
.jpg)

.webp)



