Latest News

మహిళల రక్షణకు మగవారే బ్రాండ్ అంబాసిడర్లు కావాలి : సీఎం రేవంత్

posted on: Mar 7, 2026 3:17PM

 

సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళల భద్రతను కేవలం ఫిర్యాదులు, కేసుల నమోదుతో పరిమితం చేయకుండా సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.హైదరాబాద్ జేఎన్‌టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

 

 

మహిళలను ఎవరైనా వేధిస్తే చూసి చూడనట్టు ఉండకూడదని, వెంటనే నిలబడి ప్రశ్నించే ధైర్యం యువతలో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వేధింపులను నిర్లక్ష్యం చేయడం కూడా నేరాన్ని ప్రోత్సహించినట్లేనని అన్నారు. సొంత కుటుంబ సభ్యులకు ఎలా స్పందిస్తామో ఇతర మహిళల విషయంలో కూడా అదే తీరుగా స్పందించాలని పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేవలం కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బాధ్యత తీరిపోదని సీఎం పేర్కొన్నారు. మహిళను శక్తిగా భావించే సమాజంలో ఆమెకు ఎక్కడా అభద్రత ఉండకూడదన్నారు. అలాంటి పరిస్థితులను మార్చేందుకు మనలోనే మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

 

మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నామని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలను భాగస్వాములుగా చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు. తెలంగాణ గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక అభివృద్ధితోనే తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

 

 

గతంలో మహిళలపై వేధింపులు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఆన్‌లైన్ నేరాలు పెరిగాయని సీఎం తెలిపారు. డీప్ ఫేక్ వీడియోలు వంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేశామని చెప్పారు.ఏదైనా సంఘటన జరిగితే బాధితురాలినే నిందించే చెడు సంప్రదాయాన్ని సమాజం విడిచిపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం “స్టాండ్ విత్ హర్” అనే నినాదంతో అందరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం మాజీ సలహాదారు వేము నరేందర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ చారు సిన్హా, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్, పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...