కాశీబుగ్గలో తొక్కిసలాట.. తొమ్మిది మంది మృతి
posted on Nov 1, 2025 12:23PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో శనివారం (నవంబర్ 1) జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీక మాసం కావడం అందునా ఏకాదశి కూడా అవ్వడంతో శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు వేంకటేశ్వరాలయానికి పోటెత్తారు.అంచనాలకు అందనంత ఎక్కువ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.
ఈ ఘటనలో 9 మంది ఘటనాస్థలంలోనే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తొక్కిసలాట ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.