Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయ్ ఖాళీ చేసే స్థానం నుంచి స్టాలిన్ పోటీ?
posted on: May 16, 2026 11:10AM

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్వల్ప వ్యవధిలోనే.. పలు కీలక నిర్ణయాలతో రాజకీయాలకు అతీతంగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికలలో తన సొంత నియోజకవర్గమైన కోలత్తూరులో ఊహించని రీతిలో ఓటమి పాలైన స్టాలిన్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు.
అదలా ఉంటే.. అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా త్వరలోనే తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీకి దిగి.. విజయ్‌తో నేరుగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నానని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు.. డీఎంకే శ్రేణులు కూడా ఈ స్థానంపై తీవ్రంగా దృష్టి సారించాయి. తిరుచ్చి సౌత్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ మేరకు కీలక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా పోటీ చేయాలని పార్టీ స్థానిక నాయకత్వం, శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావచ్చని వారు అంటున్నారు.
అయితే, ఈ స్థానంలో పోటీ చేయడం స్టాలిన్‌కు అంత తేలికైన విషయం కాదు. ఇది ఒక రకంగా అతిపెద్ద జూదమనే చెప్పాలి. ఎందుకంటే.. విజయ్ నేతృత్వంలోని టీవీకే కి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా స్టాలిన్ ఓటమి పాలైతే, అది ఆయన రాజకీయ జీవితంలో కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉంది. కాగా ఈస్ట్ తిరుచ్చి ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారన్న అధికారిక ప్రకటన అయితే ఇంత వరకూ రాలేదు. ఈ స్థానం నుంచి స్టాలిన్ నిజంగానే బరిలోకి దిగుతారా అన్న విషయంలో స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


.webp)


