శ్రీశైలంలో కన్నుల పండువగా పుష్కరహారతి
posted on Oct 28, 2025 9:25AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, దశ హారతులిచ్చారు. కార్తికమాస మొదటి సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఉత్సవ మూర్తులకు, పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు. దశ హారతులను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పుష్కరిణి కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఈ లక్షదీపోత్సవంలో ఆలయం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు,అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు.