శివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
posted on: Feb 6, 2026 5:28PM

శ్రీశైల మల్లన్న క్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబవుతోంది. ఈ నెల 8న ప్రారంభంకాబోతున్న ఆ శివయ్య బ్రహ్మోత్సవాల కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని.. భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. అయితే అతిశీఘ్ర (రూ.500), శీఘ్ర దర్శనం (రూ.300) టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం తీపికబురు చెప్పారు. వీరు కేవలం అరగంటలోనే దర్శనం చేసుకునేలా ప్లాన్ చేశామన్నారు.
ఉచిత దర్శనం భక్తులు కేవలం 40 నిమిషాల నుంచి గంటన్నరలోపే దర్శనం పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. క్యూలైన్ల సంఖ్యను పెంచి.. బ్రహ్మోత్సవాల సమయంలో గంటకు 6 వేల నుంచి 7 వేలమంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో శివ దీక్ష భక్తులకు స్పర్శ దర్శనం ఉంటుంది తెలిపారు.
భక్తులు శ్రీశైలం ఆలయ వెబ్‌సైట్, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. శ్రీశైలం వచ్చే భక్తులు వన్‌స్టాప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.. అక్కడ సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుందంటున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ దర్శనానికి వచ్చేవారికి మూడుసార్లు మాత్రమే అవకాశం కల్పించారు. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు.. మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వరకు.. రాత్రి 7 నుంచి 7.30 గంటల సమయంలో మాత్రమే రావాలని సూచిస్తున్నారు.


.webp)
.webp)


