వైసీపీ జెడ్పీటీసీ చావు తెలివితేటలు...బీమా సొమ్ము స్వాహా!

posted on: Feb 20, 2026 9:14PM

 

చావుకు చేరువైన వారినే పెట్టుబడిగా మార్చుకుని, తప్పుడు పత్రాలతో తొమ్మిది బీమా సంస్థల్లో పాలసీలు తీసుకుని కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేపుతోంది. మృతుల కుటుంబాలకు నామమాత్రపు సొమ్ము ఇచ్చి, మిగతా మొత్తాన్ని స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో జిల్లా ఎస్పీ దర్యాప్తుకు ఆదేశించగా, బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ (IRDAI) కూడా రంగంలోకి దిగింది.

పథకం ప్రకారం వేట..

అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వృద్ధులనే లక్ష్యంగా ఎంచుకుని ఈ మోసం సాగినట్లు సమాచారం. వారి అసలు వయస్సును ఆధార్ కార్డుల్లో తగ్గించి చూపించి నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. అక్కులపేటలోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌ను అడ్డాగా చేసుకుని ఈ తప్పుడు ఆధార్ కార్డులు రూపొందించినట్లు తెలుస్తోంది.

ఆ తరువాత ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్, బజాజ్ అలియాంజ్ వంటి ప్రముఖ బీమా సంస్థల్లో భారీ మొత్తాలకు పాలసీలు తీసుకున్నట్లు చెబుతున్నారు. పాలసీ తీసుకున్న కొద్ది కాలానికే సదరు వ్యక్తి మరణించగానే ఆసుపత్రి రికార్డులు, డెత్ సర్టిఫికెట్లు మార్పులు చేసి క్లెయిమ్‌లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన మొత్తంలో కొంత మాత్రమే కుటుంబాలకు ఇచ్చి, మిగతా భాగాన్ని స్వాహా చేసినట్లు సమాచారం.

కన్నతల్లిని కూడా వదలలేదా?

ఈ వ్యవహారంలో బెండి గోవిందరావు తన సొంత తల్లిని కూడా వాడుకున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తల్లి బెండి మహాలక్ష్మి వాస్తవ వయస్సు 86 ఏళ్లు ఉండగా, ఆధార్‌లో 56 ఏళ్లుగా మార్చి తొమ్మిది బీమా సంస్థల నుంచి రూ.1.40 కోట్ల క్లెయిమ్ పొందినట్లు ఆరోపిస్తున్నారు.అలాగే భార్య సత్యవతి క్యాన్సర్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసినా, ఆమె పేరుతో పాలసీలు తీసుకుని సుమారు రూ.1.50 కోట్లు పొందినట్లు సమాచారం.

వంజంగికి చెందిన మురపాక సూర్యనారాయణ మరణించిన తరువాత, మరొకరిని ఆయనగా చూపించి పాలసీలు తీసుకుని, మరణ తేదీని సైతం మార్చి రూ.98 లక్షలు స్వాహా చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పొన్నాడ డొంకారావు, మెట్ట అన్నపూర్ణ పేర్లతోనూ ఇలాంటి క్లెయిమ్‌లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బీమా సిబ్బంది హస్తమా?

భారీ మొత్తాల పాలసీలకు సాధారణంగా క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి. అయితే తొమ్మిది సంస్థల్లో ఒకేసారి పాలసీలు మంజూరు కావడం, క్లెయిమ్‌లు ఆమోదం పొందడం వెనుక బీమా సంస్థల సిబ్బంది ప్రమేయం ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం ఒక్కో దానికి రూ.10 వేల వరకు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఉచ్చు బిగుస్తోంది..

ఈ కుంభకోణంపై జిల్లా ఎస్పీకి, ఐఆర్‌డీఏఐకు, అలాగే రాష్ట్ర మంత్రి లోకేష్‌కు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ఐఆర్‌డీఏఐ అంతర్గత విచారణ ప్రారంభించగా, ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ మోసం విలువ రూ.5 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిగితే మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...