అన్న క్యాంటీన్లు... దేవాలయాలు : రామ్మోహన్ నాయుడు

 

శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల్లో  కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తో కలసి పర్యటించారు. ఈ సంధర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. తొలుత కోటబొమ్మాళి లో పార్టీ కార్యాలయంలో జిల్లా వాసుల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం కోటబొమ్మాళి డిసిసిబి భవనానికి శంకుస్థాపన చేశారు. కోటబొమ్మాళి వీధులను పరిశీలించి అభివృద్ధికి పలు సూచనలు చేశారు. 

అనంతరం కోటబొమ్మాళి ప్రధాన రహదారిలో అన్నా క్యాంటీన్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా అక్కడివారికి భోజనాన్ని వడ్డించడం తో పాటు.. తర్వాత వారితో కలసి అన్నా క్యాంటీన్ లోనే మంత్రులు భోజనం చేశారు. అన్న క్యాంటీన్ పరిసరాలు, భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ సంధర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, స్వయంగా వడ్డించడం, వారితో కలసి భోజనం చెయ్యడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..  బృహత్తర లక్ష్యంతో అన్నా క్యాంటీన్ లను ప్రారంభించారని.. ఇక్కడ భోజనం చేసే వాళ్ళ కళ్లలో సంతోషం వెలకట్టలేనిది అని అన్నారు. 

గత సర్కారు అన్నదానానికి కూడా రాజకీయం అంటగట్టారని.. తద్వారా ఎంతోమంది నష్టపోయారని స్పష్టం చేశారు. వారు ఈ పథకాన్ని నిర్వీర్యం చెయ్యాలని చూసినా.. చంద్రబాబు గారి స్పూర్తితో రాష్ట్రంలో చాలా చోట్ల నిర్విరామంగా పథకం తెదేపా శ్రేణులు కొనసాగించాయని, టెక్కలి నియోజకవర్గంలో బాబాయ్ అచ్చెన్నాయుడు, తాను ఈ పథకాన్ని కొనసాగించిన సంగతిని గుర్తు చేశారు. 

కూటమి సర్కారు కొలువు తీరిన తరువాత మరింత వేగంతో అన్నా క్యాంటీన్ లో రాష్ట్రంలో ఏర్పడ్డాయని, కోటబొమ్మాళి లో కూడా రెండు నెలల వ్యవధిలో అన్నా క్యాంటీన్ ఏర్పడింది అంటే.. అది అచ్చెన్నాయుడు పనితీరుకు నిదర్శనం అని తెలిపారు. ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసిపోని నాణ్యత, పోషక విలువలతో అన్నా క్యాంటీన్ లో భోజనం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.  సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు దేవాలయాలు అని రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. 

కోటబొమ్మాళికి, కింజరాపు కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని..  ఇక్కడ గెలిచిన వాళ్ళు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు అంటే స్థానిక ప్రజల ప్రేమనే కారణం అని స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతున్న కోటబొమ్మాళి ను మోడల్ మండలం గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. యాభై ఏళ్లకు సరిపడా అభివృద్ధి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, కొత్తమ్మ తల్లి ఆలయాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, శ్రేణులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu