శ్రీదేవి సరే.. సిరియా అవసరం లేదా..?
posted on Feb 28, 2018 4:33PM
.jpg)
వెండితెర నిండు జాబిలి.. అతిలోక సుందరి.. అభిమానుల కలలరాణి శ్రీదేవి మరణం భారతదేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ షాక్ నుంచి తేరుకొని ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు... తమ ఆరాధ్య నటీమణిని చివరిచూపు చూసుకునేందుకు అభిమానులు ఆమె నివాసం ముందు బారులు తీరారు. ఇలోగా శ్రీదేవిది సహజ మరణం కాదంటూ దుబాయ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేయడంతో.. ఆమె పార్థివ దేహం భారత్‌కు రావడం ఆలస్యమైంది. ఆమె ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేకపోతున్న వేళ.. శ్రీదేవి మరణానికి గల కారణం చుట్టూ అనుమానాలు కలగడం అభిమానులను మరింత కలవరపాటుకు గురిచేసింది.
క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే ఈ ట్రాజడీతో మీడియాకు మంచి ఫీడ్ దొరికినట్లైంది. శనివారం అర్థరాత్రి నుంచి నేటి వరకు దుబాయ్ పోలీసులు, బాత్‌టబ్, బోనీకపూర్‌పైనే ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ మీడియా ఫోకస్ పెట్టింది. ఆఖరికి యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ శ్రీదేవి సంగతులే. దీంతో దేశంలో.. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియలేదు. అలా మీడియా హైప్ మిస్సయిన వాటిలో సిరియా సంక్షోభం ఒకటి. ఎవరి చేతుల్లో చనిపోతన్నామో.. ఎందుకు చనిపోతున్నామో.. తెలియక అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా... సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరాయి దేశాలకు వలస వెళ్లిపోతున్నారు.
అభం, శుభం తెలియని పసిపిల్లలు 500 మంది దారుణంగా చంపబడ్డారు. ఈ శతాబ్ధం ఎన్నడూ చూడని నరమేధం మనదేశంలో ఎంతమందికి తెలుసు.. శ్రీదేవి గొప్ప వ్యక్తే కావొచ్చు.. భారతదేశం గర్వించదగ్గ నటీమణి అయ్యుండవచ్చు.. కానీ ఈమె గురించి ప్రసారం చేసే గంటలో ఒక పది నిమిషాలు వారి ఆర్తనాదాలకు చోటివ్వలేరా..? ఒక ప్రముఖ కార్టూనిస్టు వేసిన ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్ని.. మీడియా చేస్తోన్న అతిని వివరిస్తుంది.