సంగారెడ్డి రామ్‌నగర్‌లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

posted on: Mar 27, 2026 2:58PM

 

సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్ రామ్ మందిర్‌లో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవం భక్తులను ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాముల దివ్య కల్యాణాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం రంగపేట పీఠాధిపతి పూజ్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో, జ్యోతిర్వాస్తు విద్యా పీఠం పీఠాధిపతి శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య నిర్వహించబడింది. కార్యక్రమానికి జగ్గారెడ్డి మిత్రులు, రామ్ మందిర్ యువసేన సభ్యులు, ఆలయ కమిటీ పెద్దలు విశేషంగా సహకరించారు.

రూ.2.50 కోట్ల విలువైన ఆభరణాల సమర్పణ

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మిత్రులు, రామ్ మందిర్ యువసేన సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి శ్రీ సీతారాముల కోసం ప్రత్యేకంగా రూ.2.50 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను తయారు చేయించారు. సుమారు 2 కిలోల 250 గ్రాముల బంగారంతో రూపొందించిన ఈ ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వాటిలో కిరీటాలు, కర్ణాభరణాలు, కంఠాభరణాలు, వడ్డానాలు, పద్మపాదాలు, ధనుస్సు–బాణం, యజ్ఞోపవీతం, తిలకాలు, నయనాలు, ముక్కుపోగు, శంఖు–చక్రాలు వంటి ఎన్నో విశిష్ట ఆభరణాలు ఉన్నాయి. అమ్మవారికి మంగళసూత్రం, కమలహస్తం, శ్రీరాముడికి శరంతో కూడిన హస్తాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అదనంగా 10 కిలోల వెండితో ఆదిశేషుడు మరియు వెండి కల్యాణ పీఠాన్ని తయారు చేసి ఆలయానికి సమర్పించారు.

జగ్గారెడ్డి నివాసంలో ప్రత్యేక పూజలు – ఘన ఊరేగింపు

కల్యాణానికి ముందు రామ్‌నగర్‌లోని జగ్గారెడ్డి నివాసంలో ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల మధ్య మంగళవాయిద్యాల నడుమ ఆభరణాలను రామ్ మందిర్ వరకు ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.ఆలయానికి చేరుకున్న అనంతరం సీతారాములకు బంగారు ఆభరణాలను సమర్పించి అద్భుతంగా అలంకరించారు. అనంతరం పండితుల వేదఘోషల మధ్య సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఈ వేడుక సంగారెడ్డి పట్టణంలో భక్తి, ఆధ్యాత్మికతను మరింత పెంచింది. భారీగా హాజరైన భక్తులు సీతారాముల ఆశీస్సులు పొందారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...