శ్రీలంక అధ్యక్షుడికి జరిగిందే అమెరికా ప్రెసిడెంట్ కైతే!?

posted on: Aug 21, 2016 3:28PM

 

తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవటానికి వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఏం జరిగిందనేది పక్కన పెట్టండి. మరో ఊహాజనితమైన పరిస్థితిని ఇప్పుడు మాట్లాడుకుందాం! అదేంటంటే... అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇండియా వచ్చాడు. ఓ చోట ఒక కార్యక్రమం కోసం ఆగాడు. తిరిగి బయటకొచ్చే సరికి ఆయన కాన్వాయ్ నడపాల్సిన డ్రైవర్లు ఒక్కరూ లేరు! కొంత సేపు ఒబామా తన కార్ లోనే కూర్చుని డ్రైవర్ల కోసం ఎదురు చూశాడు! ఇప్పుడు చెప్పండి... ఇలాంటి సమన్వయ లోపం భారత్ కు ఎంత అప్రతిష్ఠకరం? పైగా ఒక దేశాధ్యక్షుడికి ఎంత ప్రమాదకరం?

 

మనం ఊహించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడికి ఆయన పర్యటనలో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు కాని శ్రీలంక ప్రెసిడెంట్ కి వచ్చాయి. సాటి దేశపు అధ్యక్షుడు అయిన ఆయన శ్రీవార్ని దర్శించుకుని గుడి నుంచి బయటకు రాగానే కాన్వాయ్ బయలుదేరలేదు. కారణం టీటీడీ అధికారులకి, పోలీసులకి మధ్య జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్. డ్రైవర్లంతా ఎక్కడో వుండగానే వచ్చి కార్లో కూర్చున్న మైత్రిపాల సిరిసేన కాస్సేపు టెన్షన్ టెన్షన్ గా అందులో వెయిట్ చేసి డ్రైవర్స్ వచ్చాక బయలుదేరారు. ఇది మనకు చిన్న విషయంగానే తోచవచ్చు కాని చాలా పెద్ద అవమానం, ప్రమాదం కూడా!

 

శ్రీలంక అధ్యక్షుడంటే సహజంగానే ఇండియాలోని అతివాద తమిళ సంస్థలకి కోపం వుంటుంది. అలాంటి హిట్ లిస్ట్ లో వున్న వీవీఐపీ సెలబ్రిటీని టీటీడీ, పోలీసులు జాగ్రత్తగా చూసుకుని స్వదేశానికి పంపాలి. అంతే కాని, కాన్వాయ్ నడపటానికి డ్రైవర్లు కూడా అందుబాటులో లేకుండా చేస్తే ఎలా? రేపు మరో దేశంలో మన ప్రధానికే ఇలాంటి అనుభవం ఎదురైతే మనం లైట్ తీసుకుంటామా?

 

భద్రత, జాగ్రత్తల విషయంలో అన్ని చోట్లకంటే తిరుమల వద్ద మరింత పకడ్బందీగా వుండాలి. ఎందుకంటే, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలన్నిటికి హిందువుల పరమ పవిత్ర క్షేత్రమైన తిరుమలే టార్గెట్. కాబట్టి ఇక మీదైనా సెలబ్రిటీల్ని, సామాన్యుల్ని టీటీడీ, పోలీసులు కంటికి రెప్పలా కాపాడాలి! మానవ ప్రయత్నానికి తోడుగా అందర్నీ కాచేవాడు ఆ వెంకన్న స్వామీ ఎలాగూ వుండనే వున్నాడు!

google-ad-img
    Related Sigment News
    • Loading...