బీజేపీని సవాల్ చేయలేకపోయిన స్ప్లింటర్ పార్టీలు

posted on: Jun 8, 2026 5:47AM

భారతీయ జనతా పార్టీ నుంచి విడిపోయిన నాయకులు సొంతంగా  స్ప్లింటర్..   అంటే  సొంత పార్టీలు పెట్టి, జాతీయ లేదా రాష్ట్ర రాజకీయాల్లో ప్రయోగాలు చేయడం భారత రాజకీయాల్లో తరచూ జరుగుతున్నదే. భారత రాజకీయాల్లో స్ప్లింటర్ పార్టీలు అనేవి కేవలం నాయకుల వ్యక్తిగత అజెండాలకు, అసంతృప్తులకు నిదర్శనంగా మిగులుతున్నాయే తప్ప, సైద్ధాంతికంగా బీజేపీని దాటి బలమైన ప్రత్యామ్నాయంగా మారిన దాఖలాలు కనిపించవు. 

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి బీజేపీని వీడి భారతీయ జనశక్తి పార్టీ (బీజేఎస్)  స్థాపించారు. అయితే యూపీలో 5 శాతం ఓట్లు మాత్రమే సాధించి ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. దాంతో ఆమె మళ్లీ బీజేపీ గూటికి చేరారు. కర్ణాటక మాజీ సీఎం యాడ్యురప్ప కూడా బీజేపీ మీద అలిగి కర్ణాటక జనత పక్ష (కేజేపీ) అని సొంత కుంపటి పెట్టుకున్నారు. నాలుగు సార్లు సీంగా పనిచేసిన ఆయన పార్టీ పది శాతం ఓట్లు దక్కించుకోవడం గగనమైంది. దాంతో ఆయన తిరిగి కాషాయ గూటికే తిరిగొచ్చారు. 

యూపీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మరో మాజీ సీఎం కళ్యాణ్‌సింగ్‌ది కూడా అదే హిస్టరీ. కాషాయ కండువా తీసేసి, రాష్ట్రీయ క్రాంతి పార్టీ (ఆర్‌టికేపీ) పేరుతో పార్టీ పెట్టుకుని చక్రం తిప్పుదామని చూసిన కళ్యాణ్ సింగ్.. ఎన్నికల్లో తన పార్టీకి దక్కిన 5 శాతం ఓట్లతో తిరిగి బీజేపీ పంచకే చేరల్సి వచ్చింది. ఇక గుజరాత్‌లో నరేంద్రమోడీకి ముందు రెండు సార్లు బీజేపీ సీఎంగా పనిచేసిన కేశూభాయ్ పటేల్.. మాజీ అయ్యాక బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ (జీపీపీ) పేరుతో పార్టీ పెట్టి కనీసం ప్రభావం చూపలేకపోయారు. దాంతో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఝార్ఖండ్‌లో బాబూలాల్ మరిండీ సైతం బయటకు వెళ్లి జేవీఎం-పీ అని పార్టీ పెట్టుకున్నప్పటికీ తిరిగి సొంత గూటికే తిరిగివచ్చారు. హర్యానాలో జన వికాస్ మంచ్ పేరుతో ప్రాంతీయంగా కొంత ప్రభావం చూపించిన కుల్దీప్ బిష్ణోయ్ తరాత యూటర్న్ తీసుకోక తప్పలేదు.

బీజేపీ నుంచి విడిపోయి సొంతపార్టీ ప్రయోగాలు చేసిన నాయకులంతా తమతమ రాష్ట్రాల్లో పలుకుబడి, అంగ, అర్థబలాలు  ఉన్నవారే . అయితే సొంతగా పార్టీ వ్యవస్థను ఛాలెంజ్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. అంటే స్ప్లింటర్ పార్టీలు భారతీయ రాజకీయాల్లో న్యూసెన్స్ వాల్యూ  చూపగలవు..  కానీ  పవర్ వాల్యూ  సాధించలేవని కంక్లూజన్ ఇస్తున్నారు అనలిస్టులు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...