బిహార్‌కి ప్రత్యేకంగా ఐపీఎల్ టీమ్?

posted on: May 23, 2026 12:13PM

ఐపీఎల్‌లో బీహారీలు మెరుపులు మెరిపిస్తున్నారు. పాట్నాలో జన్మించిన  ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమై డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 131 బంతుల్లో 210 పరుగులు చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమై డబుల్ సెంచరీతో రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపిస్తూ అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్‌ను పరిచయం చేశాడు.

బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రంతోనే అబ్బుర పరుస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్.. జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను భయపెడుతూ తానేంటో నిరూపించుకుంటున్నాడు.  వీరితో పాటు బీహార్   గోపాల్‌గంజ్‌కు చెందిన సాకిబ్ హుస్సేన్ కూడా తన పదునైన బౌలింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 

దేశంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్, 5 సార్లు సీఎస్కేని ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన  మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఉమ్మడి బీహార్‌లోని రాంచీలో జన్మించిన సంగతి తెలిసిందే. ఇలా బీహార్ క్రికెటర్ల అద్భుత ప్రదర్శన చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత రీసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరహాలోనే బీహార్‌కు కూడా ఒక ప్రత్యేకమైన ఐపీఎల్ జట్టు ఉండాలని ఆయన బలంగా ఆకాంక్షించారు. 

బీహార్ మట్టిలో ఎంతో మంది అసాధారణ క్రికెటర్లు ఉన్నారని, బీహార్‌కు సొంత జట్టు వస్తే ఇక్కడి యువతకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. బీహార్ నుంచి వచ్చే జట్టు ప్రపంచంలోనే అత్యత్తమ జట్టుగా నిలుస్తుందన్నారు. ఐపీఎల్‌లో నాలుగేళ్ల కిందట రెండు ఫ్రాంచైజీలు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా వచ్చాయి. ఇప్పటికే ఐపీఎల్ మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరగడంతో కొత్త ఫ్రాంచైజీలకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఏపీ నుంచి ఒక, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి ఒక ఫ్రాంచైజీకి అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు బిహార్‌కు చెందిన బిలియనీర్ నేరుగా రంగంలోకి దిగడంతో ఐపీఎల్ మేనేజ్ మెంట్ ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...