నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవ్స్ కు … 450కోట్ల మోదీ గిఫ్ట్!
posted on: May 5, 2017 11:07AM

దక్షిణాసియా ఉపగ్రహం… వినటానికే విచిత్రంగా వుంది కదా? నిజంగానే ఇది కొంత విచిత్రమైన, వినూత్నమైన ఉపగ్రహం. మరి కొన్ని గంటల్లో నింగిలోకి దూసుకుపోనున్న సౌత్ ఏషియా సాటిలైట్ మన చుట్టూ వున్న దేశాలకీ మనం ఇస్తోన్న అంతరిక్ష బహుమతి! అసలు ఉపగ్రహాన్ని భారత్ ఇతర దేశాలకి బహుమతిగా ఇవ్వటం ఏంటి అంటారా? అయితే ఈ ఇంట్రస్టింగ్ థింగ్స్ తెలుసుకోవాల్సిందే!
కొన్ని గంటల్లోనే మన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచీ నింగికి ఎగియనుంది దక్షిణాసియా ఉపగ్రహం. దీని ప్రత్యేకత ఏంటంటే… మూడేళ్లుగా 450కోట్లు ఖర్చు చేసి రూపొందించిన ఈ వైజ్ఞానిక అద్బుతం భారత్ తో పాటూ నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ లకు కూడా సేవలందించనుంది! దీన్నే అంతర్జాతీయ పరిభాషలో స్పేస్ డిప్లోమసీ అంటారు! చైనా ఇప్పటికే అంతరిక్ష రంగంలో ఈ అంతరిక్ష రాజనీతిని ఉపయోగించి కొన్ని దేశాలకి సాయం చేసింది. తద్వారా వాట్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. బదులుగా మోదీ చేసిన ఆలోచనే ఈ దక్షిణాసియా ఉపగ్రహం! పాకిస్తాన్ మినహా సార్క్ దేశాలన్నీ ఈ సాటిలైట్ ద్వారా భారత్ అందించే సేవల్ని పొందనున్నాయి!
మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ సౌత్ ఏషియా సాటిలైట్ ని మోదీ భారత్ ఇస్తోన్న గిఫ్ట్ గా అభివర్ణించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ … కేవలం ఇండియాకే పరిమితం కాదని ఆయన చెప్పారు. సహజ వనరుల్ని గుర్తించటం, టెలీమెడిసిన్, విద్యా వంటి అనేక రంగాల్లో ఈ ఉపగ్రహం భూటాన్, మాల్దీవ్ల వంటి దేశాలకి ఎంతో కీలకం కానుంది. వాటికి ఇప్పటి వరకూ అంతరిక్షంలో ఎలాంటి ఉపగ్రహాలు లేవు. అలాగే, నేపాల్, శ్రీలంక, బంగ్లాదే్శ్ లు కూడా మన ఉపగ్రహం నుంచి సేవల్ని పొందుతాయి. పాకిస్తాన్ తనకు తానే ఈ ప్రొగ్రామ్ నుంచి తప్పుకుంది!
ఇండియా అందిస్తోన్న ఈ గిఫ్ట్ సాటిలైట్ వల్ల ముందు ముందు ప్రకృతి విపత్తులు వచ్చినా సార్క్ దేశాల మధ్య హాట్ లైన్స్ కొనసాగుతాయి. అందువల్ల కమ్యూనికేషన్ ఎంతో మెరుగవుతుంది. జీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి గురి పెట్టడం ఇస్రోకు ఇది పదకొండోసారి! గతంలో జీఎస్ఎల్వీతో చేసిన ప్రయోగాలు ఘన విజయాలు సాధించాయి! మొత్తం మీద సౌత్ ఏషియా సాటిలైట్ దక్షిణాసియాలో భారత్ ని విలక్షణ శక్తిగా నిలుపుతుందనేది నిస్సందేహం!



.jpg)
.jpg)


.webp)


