15 ఏళ్ల అద్భుతం.. సూర్యవంశీ నెక్ట్స్ టార్గోట్ ఏంటో తెలుసా?

posted on: Jun 1, 2026 9:47AM

15 ఏళ్ల అద్భుతం వైభవ్ సూర్యవంశీ సంచలనాలు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరుస్తున్నాయి. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో  వైభవ్ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.  ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అసాధారణమైన బ్యాటింగ్ విన్యాసాలతో స్టేడియంలను హోరెత్తించిన యువ కెరటం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగిన ఈ కుర్రాడు, అనుభవజ్ఞులైన అంతర్జాతీయ బౌలర్లను సైతం బెంబేలెత్తిస్తూ పరుగుల వరద పారించాడు. సీజన్ ముగింపు వేడుకలో ఈ యూనివర్శల్ బాస్ బేబీ ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.  అత్యున్నతమైన ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, మరియు సూపర్ సిక్సెస్ అవార్డులను తన ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ నమోదు చేసిన గణాంకాలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. సీజన్ మొత్తం 776 పరుగులు సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కేవలం పరుగులే కాదు, అతడు బంతిని బాదిన తీరు కూడా అమోఘం. ఈ ఒక్క ఎడిషన్‌లోనే ఏకంగా 72 భారీ సిక్సర్లు కొట్టి సరికొత్త మైలురాయిని అధిగమించాడు. ఆధునిక టి20 క్రికెట్ ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతూ 231.7 సంచలన స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ సాగించాడు. ఈ క్రమంలోనే లీగ్‌లో 400, 500, 600 పరుగుల మార్కులను అత్యంత వేగంగా అందుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ అద్భుత ప్రదర్శనను చూసి సాక్షాత్తూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం ముగ్ధుడైపోయాడు. వైభవ్ బ్యాటింగ్ శైలిని ప్రశంసిస్తూ.. అతడు భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమని జోస్యం చెప్పారు.

అవార్డుల ప్రదానోత్సవం ముగిసిన తర్వాత మాజీ క్రికెటర్ రవిశాస్త్రితో వైభవ్ ముచ్చటించాడు. ఎంతో పరిణతితో మాట్లాడుతూ.. మైదానంలో అవార్డులు గెలవడం ఎంతో గర్వంగా ఉన్నప్పటికీ, ఇలా మైక్ పట్టుకుని ఇంటర్వ్యూలు ఇవ్వడమే తనకు  ఒత్తిడిగా అనిపిస్తోందన్న వైభవ్ సూర్యవంశీ, బంతిని బలంగా బాదడమే తన సహజ సిద్ధమైన నైజమని, అయితే ఈ సుదీర్ఘమైన సీజన్ ద్వారా పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆటను ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నానన్నాడు. అదే సమయంలో సంజయ్ మంజ్రేకర్, మహ్మద్ కైఫ్ వంటి మాజీ దిగ్గజాలు వైభవ్ ఫీల్డింగ్ ప్రమాణాలపై కొన్ని సూచనలు చేశారు. దీనిపై రవిశాస్త్రి స్పందిస్తూ..  అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘకాలం కెరీర్‌ను సాగించాలంటే నైపుణ్యంతో పాటు శారీరక దృఢత్వం ఎంతో అవసరమని, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు.

సీనియర్ల సూచనలను వైభవ్   వినమ్రంగా స్వీకరించాడు. ఐపీఎల్ ముగిసిన తరుణంలో తన తదుపరి ప్రణాళికలను స్పష్టం చేస్తూ, ఇకపై తన పూర్తి దృష్టి ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడంపైనే ఉంటుందని ప్రకటించాడు. భవిష్యత్తులో గాయాల బారిన పడకుండా సుదీర్ఘ కాలం రాణించాలంటే ఫిట్‌నెస్ అత్యంత కీలకమని గ్రహించినట్లు తెలిపాడు. ఈ అద్భుతమైన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ సీనియర్ ఆటగాళ్లకు, సపోర్ట్ స్టాఫ్‌కు తానెప్పుడూ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు చెప్పాడు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...