సోనియాగాంధీపై నట్వర్ విమర్శలకు బదులేది?

 

మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ తన ఆత్మకధ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు అనేక ఆరోపణలు చేసారు. వాటికి సోనియాగాంధీ నేరుగా సమాధానం చెప్పడమో లేక ఖండించడమో చేయకుండా తను కూడా తన ఆత్మకధ పుస్తకం వ్రాసి దానిలో ఆయన చేసిన ఆరోపణలకు జవాబు చెపుతానని తప్పించుకోవడం గమనిస్తే నట్వర్ సింగ్ చేసిన ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తోంది.

 

సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవి చేప్పట్టాలనుకొన్నప్పుడు, ఆ పదవి చేపడితే ఉగ్రవాదుల వలన ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చనే భయంతోనే ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఆమెను ప్రధానమంత్రి పదవి చేప్పట్టకుండా అడ్డుపడ్డారనే సంగతి నట్వర్ సింగ్ తన పుస్తకంలో బయటపెట్టారు. ఆయన చెప్పిన ఈ విషయాన్ని సోనియాగాంధీ ఖండించినా లేక నిజాయితీగా అంగీకరించినా బాగుండేది. కానీ ఆమె కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా తన కుటుంబం చేసిన త్యాగాల గురించి  మాట్లాడి, ఇటువంటి ఆరోపణలు తనను కదిలించాలేవని అన్నారు.



ఇక ఆమె భర్త రాజీవ్ గాంధీ మరణాంతరం ఆమె ప్రధానమంత్రి పదవి చెప్పట్టకపోయినప్పటికీ, ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోనేదని, అనేక ముఖ్యమయిన ఫైళ్ళు ఆమె ఇంటికి తెప్పించుకొని వాటిపై నిర్ణయాలు తీసుకోనేవారని నట్వర్ సింగ్ ఆరోపించారు. ఇది చాలా తీవ్రమయిన ఆరోపణ. ప్రభుత్వ వ్యవహారాలలో గోప్యనీయత పాటిస్తామని మంత్రులు ప్రమాణం చేస్తారు. కానీ, ప్రభుత్వంలో భాగస్వామి కాని ఒక వ్యక్తి ఇంటికి అత్యంత కీలకమయిన ప్రభుత్వ ఫైళ్ళను తీసుకువెళ్ళడం, దానిపై ఆమె తీసుకొన్న నిర్ణయాలను ప్రభుత్వం అమలుచేయడం నిసందేహంగా ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. కానీ ఇటువంటి నేరాలకు పాల్పడినవారికి శిక్షలు పడిన దాఖలాలు లేవు గనుక, ఇప్పుడు కూడా అదే జరగవచ్చును.



ఇక ఎమర్జన్సీ తరువాత వచ్చిన ఎన్నికలలో కూడా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 181 సీట్లు గెలుచుకొందని, కానీ ఇప్పుడు ఎటువంటి ఆటంకమూ లేకపోయినా సోనియా, రాహుల్ గాంధీల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లు మాత్రమే గెలుచుకోవడాన్ని కూడా నట్వర్ సింగ్ తప్పు పట్టారు. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి కలగడానికి కారణం ఆ తల్లి కొడుకులను కాక మరెవారిని తప్పు పట్టగలమని నట్వర్ సింగ్ ప్రశ్నించారు.



ఆయన చేసిన ఈ ఆరోపణలకు, విమర్శలకు, ప్రశ్నలకు వేటికీ కూడా సోనియాగాంధీ నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. కనీసం వాటిని ఖండించే దైర్యం చేయలేకపోయారు. అందువల్ల నట్వర్ సింగ్ చేసిన  ఆరోపణలు నిజమని నమ్మకతప్పదు.