కరీంనగర్ సభలో టీఆర్ఎస్ రసాభస?
posted on Apr 16, 2014 4:10PM
.jpg)
బుధవారం కరీంనగర్‌లో జరిగే సోనియాగాంధీ సభని సూపర్ సక్సెస్ చేసి మేడమ్ అనుగ్రహాన్ని పొందాలని టీ కాంగ్రెస్ నేతలు నానా తంటాలూ పడుతూ వుంటే, ఆ సభలో రసాభస సృష్టించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ కాకుండా వేరే ఏ పార్టీ అయినా, ఏ సంస్థ అయినా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే, ఆ సభల్లో దూరిపోయి కీలక సమయంలో నినాదాలు చేసి సభలో రసాభస సృష్టించడం టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఎన్నోసార్లు ఈ విద్యని ప్రదర్శించి టీఆర్ఎస్ పొలిటికల్ మైలేజ్ పెంచుకోగలిగింది.
ఇప్పుడు సోనియా మీటింగ్ విషయంలో కూడా ఈ ట్రిక్ ప్రదర్శించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సోనియాగాంధీ కరీంనగర్ సభలో పాల్గొనడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం వుందని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఈ సభలో కలకలం సృష్టించడం ద్వారా ఏదో సాధించాలని టీఆర్ఎస్ ఆశించవచ్చని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.