చిక్కుల్లో సోనియా అల్లుడు..!

posted on: Jun 1, 2016 2:56PM

వివాదాలకు కేంద్రబిందువైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌వాద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ ఆయుధ వ్యాపారి వాద్రా కోసం లండన్‌లో మ్యాన్షన్‌ను కొనుగొలు చేశాడని వచ్చిన ఆరోపణలపై కేంద్రప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో రాబర్ట్‌వాద్రా, అతని అసిస్టెంట్ మనోజ్ అరోరా ఈ మెయిల్‌ నుంచి ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీకి ఈమెయిల్‌కు ఈ వెళ్లిన సమాచారం ఆధారంగా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రెండు నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా కొత్త విచారణను ప్రారంభించాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. గత నెలలో సంజయ్‌భండారీకి చెందిన 18 ప్రాంతాల్లోని ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దాడులు జరుపగా, వాద్రాకు సంబంధించిన మ్యాన్షన్‌ వివరాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

 

ఈ మ్యాన్షన్‌లో మరమ్మత్తులు తదితరాలపై రాబర్ట్ వాద్రా సమాచారాన్ని కోరుతూ, సలహా, సూచనలు ఇస్తున్న ఈ-మెయిల్ 2010 ఏప్రిల్ 4న భండారీకి వెళ్లిందని నివేదికలో ఉంది. లండన్‌లోని భండారీ బంధువు సుమిత్ చద్దాకు వెళ్లిన ఈ-మెయిల్‌లో "నా కార్యదర్శి మీకు అందుబాటులో ఉంటారు " అని ఉందని, ఆపై మనోజ్ ఎక్సిమ్ రియల్ ఎస్టేట్ పేరిట ఈ-మెయిల్ ఐడీ తెరిచి సుమిత్‌తో మాట్లాడుతూ ఉన్నారని పేర్కొంది. ఈ అభియోగం బీజేపీ పాలిట వరమైంది..సోనియా కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్యస్వామి చేతికి మరో ఆయుధం దొరికినట్లైంది. వాద్రా బ్రిటన్ పౌరసత్వం కోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించారని..అక్కడి పౌరసత్వం రాగానే చెక్కేసేందుకు సన్నాహలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాద్రాపై భారత్‌లో నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అటు కాంగ్రెస్ కూడా ఈ వ్యవహారంపై ఎదురుదాడికి దిగింది. రాబర్ట్‌వాద్రాను ఓ పద్థతి ప్రకారం ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించింది. మరి సోనియా తన అల్లుడిని ఈ గండం నుంచి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...