మా అబ్బాయి చాలా గ్రేట్: సోనియా గాంధీ

 

సుమారు రెండు నెలల పాటు కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి కూడా శలవుపెట్టి విదేశాలలో ‘చార్జింగ్’ చేసుకొని వచ్చిన రాహుల్ గాంధీ భూసేకరణ చట్టానికి మోడీ ప్రభుత్వం చేసిన సవరణలని వ్యతిరేకిస్తూ గట్టిగానే పోరాడారు. రాహుల్ గాంధీ చేసిన పోరాటం వలననే మోడీ ప్రభుత్వం తన నిర్ణయం ఉపసంహరించుకోవలసి వచ్చిందని సోనియా గాంధీ ఏ.ఐ.సి.సి. సమావేశంలో చెప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ భూసేకరణ బిల్లులో సవరణలను వ్యతిరేకిస్తూ కేవలం రాహుల్ గాంధీ ఒక్కరే పోరాడలేదు. దేశంలో ప్రతిపక్షాలన్నీ దానిని తీవ్రంగా వ్యతిరేకించినందునే మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంది. కానీ సోనియాగాంధీ ఆ ఖ్యాతిని తన ముద్దుల కొడుక్కి కట్టబెట్టుకొన్నారు.

 

రాహుల్ గాంధీకి నిజంగా అంత పోరాటపటిమ, మోడీని నిలువరించే దైర్య సాహాసాలు ఉన్నట్లయితే త్వరలో జరుగబోయే బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేత ఒంటరిగా పోటీ చేయించి దానికి విజయం సాధించి చూపినట్లయితే అందరూ అతని పోరాట పటిమను మెచ్చుకొనేవారు. కానీ బీహార్ లో ఒంటరిగా పోటీ చేసే దైర్యం లేక ‘జనతా పరివార్’ విదిలించిన 40 సీట్లతో సర్దుకుబోతున్నారు. అంతేకాదు, తన తల్లి చేతుల్లో నుండి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొనేందుకు భయపడటంతో మళ్ళీ ఆమె పదవీ కాలం మరొక ఏడాదిపాటు పొడిగిస్తూ ఏ.ఐ.సి.సి. నిర్ణయం తీసుకొంది. అటువంటి రాహుల్ గాంధీని చూసి సోనియా గాంధీ మురిసిపోవడం దేనికో అర్ధం కాదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu