Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...19వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. : వైద్య సేవలు అందించాలని కోర్టు ఆదేశం.!
posted on: Jul 16, 2026 1:14PM

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరశన దీక్ష గురువారం (జులై 16) నాటికి 19వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు తాజాగా వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని వైద్య చర్యలను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది.
వివరాలిలా ఉన్నాయి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ప్రాణం అత్యంత విలువైనదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరసనకారుడి ప్రాణ రక్షణ నిమిత్తం తగిన వైద్య సహాయాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది.
59 సంవత్సరాల వయసున్న సోనమ్ వాంగ్‌చుక్.. గత 19 రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే సుమారు 8.5 కిలోల మేర బరువు తగ్గినట్లు పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. మరో 48 గంటల పాటు ఇదే విధంగా నిరశన దీక్ష కొనసాగితే ఆయన అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం పడి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అవసరమైన పక్షంలో ద్రవరూపంలో ఉండే పోషక విలువలు, విటమిన్లు, అలాగే ఖనిజాలను శరీరానికి అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ పిటిషన్ విచారణ సమయంలో న్యాయస్థానం.. ఇంత కాలంగా దీక్ష జరుగుతున్నా ప్రభుత్వ వైద్య బృందాలు ఆయన ఆరోగ్యాన్ని ఎందుకు క్రమబద్ధంగా పరీక్షించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తుషార్ మెహతా స్పందిస్తూ, వాంగ్‌చుక్‌కు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వైద్యులు సైతం ఆయనను పరీక్షిస్తున్నారని వివరించారు. అయితే దీనిపై సంతృప్తి చెందని హైకోర్టు.. ఇకపై కేవలం ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలోనే రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ సాగాలని, పరిస్థితి విషమిస్తే ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది.
మరోవైపు హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడానికి కొన్ని గంటల ముందే సోనమ్ వాంగ్‌చుక్ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. సుదీర్ఘ నిరాహార దీక్ష కారణంగా తన శరీరం కొంత బలహీన పడిన మాట నిజమేనని.. అయినప్పటికీ తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుండి సరైన స్పందన వచ్చేంత వరకు తానే రకమైన పరిస్థితుల్లోనూ ఈ దీక్షను విరమించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.
తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ఆయన రాబోయే రోజుల్లో చేపట్టబోయే నిరసన ప్రణాళికను కూడా వెల్లడించారు. జులై 20న జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు. ఈ మహా ధర్నాకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమం పూర్తయిన తర్వాత, తాము లేవనెత్తుతున్న ప్రజా సమస్యల బాధ్యతను ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులకు అప్పగిస్తామని వాంగ్‌చుక్ వివరించారు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఈ అంశాలపై గళం విప్పినప్పుడే ఈ ఉద్యమం సరైన మార్గంలో పయనించి ఆశించిన లక్ష్యాలను చేరుకుంటుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తాజా ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వాంగ్‌చుక్ నిరసన వేదిక వద్ద ప్రభుత్వ డాక్టర్లతో కూడిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
Delhi High Court on Sonam Wangchuk, Ladakh Activist Protest Delhi, Sonam Wangchuk Health Condition, Jantar Mantar Protest July 20



.webp)


