అంత ధైర్యం ఎవరిచ్చారు....?
posted on: Jan 29, 2018 10:25AM

ఏంతో సహనంగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆఖరికి బీజేపీ నేతల వైఖరి నచ్చక ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. అయినా కూడా బీజేపీ నేతలు తమ వైఖరి మార్చుకోనట్టే కనిపిస్తోంది. ఇన్ని రోజులు బీజేపీ మిత్రపక్షం కదా అని.. ఆ పార్టీ నేతలు ఎన్ని విమర్శలు గుప్పించినా.. చూసి చూడనట్టు వదిలేసి... టీడీపీ నేతను తిరిగి బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నా వారిని వారించి.. సర్థిచెప్పిన చంద్రబాబు ఓపిక నశించి.. పొత్తు వద్దనుకుంటే మా దారి మేము చూసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే చంద్రబాబు ఇంత మాట అన్నారంటే ఎందుకో అని ఆలోచించాల్సిన బీజేపీ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సోము వీర్రాజు లాంటి నేతలు. రాజుగారు మాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు మేము లేకపోతే టీడీపీయే లేదు.. మావల్లే టీడీపీ గెలిచింది అన్న రేంజ్ లో మాట్లాడుతారు. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా టీడీపీపై విమర్శలు గుప్పించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసిందని... మోసాన్ని మేం మర్చిపోమని అన్నారు. అక్కడితో ఆగకుండా... మేం కూడా మిత్రధర్మమే పాటిస్తున్నామని, టీడీపీయే పాటించడం లేదు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్న విషయాన్ని గుర్తించాలి... రాష్ట్రంలో నిధుల సేకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు.
ఇక చంద్రబాబే మా దారి మేం చూసుకుంటాం అని అన్న తరువాత... ఇంక పార్టీ నేతలు ఊరుకుంటారా..? రాజుగారికి గట్టి కౌంటరే ఇచ్చారు. మంత్రి సుజయ కృష్ణ రంగారావు రాజుగారి మాటలకు స్పందించి.. " ఆ రోజు ఎవరైతే ఇండిపెండెట్స్‌గా నిలిచారో వారిని పూర్తిగా దూరం పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సీఎం స్థాయి చంద్రబాబు నాయుడే పార్టీ కేడర్‌కు ఆదేశాలివ్వడం జరిగింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి లేకుండా పోటీ చేసిన వారిని పూర్తిగా తొలగించడం జరిగింది. కాబట్టి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? బీజేపీ ఇలా మాట్లాడటం సబబుకాదు" అని మంత్రి ఘాటుగా స్పందించారు...
మరి బీజేపీ వైఖరి చూస్తుంటే వీరికి తెలుగుదేశంతో పొత్తు ఉండటం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కాస్త సంయమనం పాటించాల్సిన టైంలో కూడా, రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తూ, ఏకంగా చంద్రబాబునే అంటున్నారు. అంతేకాదు ఏ ధైర్యం చూసుకొని రెచ్చిపోతున్నారు అని కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి చూడపోతే... టీడీపీ-బీజేపీ ఇంకెన్నో రోజులు కలిసిఉండనట్టే కనిపిస్తోంది. మరి ఇంక వచ్చే ఎన్నికల్లో పొత్తు సంగతి దెవుడికెరుక...



.jpg)


.webp)



