జగన్‌లో ఏదో తేడా కనిపిస్తోంది...వెంటనే ట్రీట్మెంట్ అవసరం : సోమిరెడ్డి
posted on Oct 25, 2025 9:12PM
.webp)
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన, జగన్ ప్రవర్తనలో ఏదో తేడా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు
“ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలు మోసినోడు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, కానీ ఆ దమ్ము లేదు. తాడేపల్లిలో కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు,” అని సోమిరెడ్డి విమర్శించారు.
జగన్‌పై మరింత సూటిగా విమర్శిస్తూ, ఆయన మాట్లాడుతూ “దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా 2.30 గంటలు ఆపకుండా అబద్ధాలు మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇంకెవరూ ఉండరేమో. పబ్లిక్ మీటింగుల్లో గంటపాటు స్పీచ్ ఇచ్చే వారిని చూశాం కానీ ఇంత సేపు ప్రెస్ మీట్ పెట్టేవారిని ఎప్పుడూ చూడలేదు. శాసన సభలో అరగంట కూడా కూర్చోలేని పెద్దమనిషి మీడియ సమావేశంలో 2.30 గంటలు కూర్చుంటాడు,” అన్నారు.
జగన్ వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “ఆయనలో చాదస్తం కాదు... కచ్చితంగా ఏదో తేడా ఉంది. తల్లి, చెల్లి ఆయనకు దూరంగా ఉన్నారు. కనీసం భార్య భారతమ్మ అయినా ఆస్పత్రికి తీసుకెళ్లి బ్రెయిన్ టెస్ట్ చేయించాలి. నా దృష్టికి ఆయనకు వెంటనే ట్రీట్మెంట్ అవసరం అనిపిస్తోంది,” అని హితవు పలికారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా సాధిస్తే దానికి జగన్ బ్లూ మీడియా వ్యతిరేకిస్తుందని, తర్వాత రోజు అదే విషయాన్ని తానే సాధించానని చెప్పుకునే స్థితికి ఆయన చేరుకున్నారని సోమిరెడ్డి విమర్శించారు. “ఇలాంటి రాజకీయ నాయకుడిని గత 50 ఏళ్ల చరిత్రలో చూడలేదు,” అని ఘాటుగా సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.