Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత్‌లో సౌర విద్యుత్ విప్లవం.. నిల్వ, గ్రిడ్ పంపిణీలో సవాళ్ళివే.!
posted on: Aug 12, 2026 8:05AM

ఇండియా ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. సాంప్రదాయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, హరిత ఇంధనం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. గత నాలుగేళ్లలో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 138 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. దేశ వ్యూహాత్మక ఇంధన అవసరాల దిశలో వచ్చిన అసాధారణ పరిణామం. విద్యుత్ డిమాండ్ ఏటా వేగంగా పెరుగుతున్న తరుణంలో.. పునరుత్పాదక శక్తి వనరులను విస్తరించడం ఆవశ్యకంగా మారింది.
సుమారు 60 బిలియన్ యూనిట్ల స్థాయిలో ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి.. ప్రస్తుతం 143 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి కూడా 1,484 బిలియన్ యూనిట్ల నుండి 1,840 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. విస్తరిస్తున్న ఈ డిమాండ్‌ను తట్టుకోవడంలో సోలార్ ప్రాజెక్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా సౌర శక్తిని విస్తరిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది.
దశాబ్దాల ప్రయాణం.. 3 గిగావాట్ల నుండి 129 గిగావాట్లకు..
సౌర రంగంలో ఈ స్థాయి పురోగతి ఒక్క రోజులో సాధ్యమైనది కాదు. గత పన్నెండేళ్లలో ప్రభుత్వ విధానాలు, విదేశీ, ప్రైవేట్ పెట్టుబడులు, ప్యానెల్ల తయారీలో సాంకేతిక విప్లవం, పోటీ బిడ్డింగ్ విధానాలు ఈ రంగాన్ని పరుగులు పెట్టించాయి. 2014 నాటికి దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం కేవలం 3 గిగావాట్ల మేర మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సామర్థ్యం 129 గిగావాట్లకు చేరుకోవడం ఒక మైలురాయి. .
గుర్తించాల్సిన అంశమేంటంటే.. స్థాపిత సామర్థ్యం (గిగావాట్లు) పెరిగినంత మాత్రాన, నిరంతర విద్యుత్ ఉత్పత్తి (బిలియన్ యూనిట్లు) జరగదు. వాతావరణ మార్పులు, మేఘావరణం, సూర్యకాంతి సమయం, గ్రిడ్ పరిమితులు వాస్తవ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం: గృహ వినియోగదారులకు సౌర కాంతి
సాధారణ పౌరులను, గృహ వినియోగదారులను ఉపాధి, విద్యుత్ ఉత్పత్తి భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టింది. 75 వేల 021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపకల్పన చేసిన ఈ పథకం ద్వారా 2027 నాటికి కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా లక్ష్యంగా పెట్టుకున్నారు.
సబ్సిడీ ప్రయోజనాలు.. ఒక కిలోవాట్ వ్యవస్థకు 30 వేలు, రెండు కిలోవాట్లకు 60 వేలు, మూడు కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ. 78 వేల రూపాయల వరకూ కేంద్ర సబ్సిడీ అందుతోంది.
ప్రస్తుత పురోగతి.. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుండగా, ఇప్పటికే లక్షలాది గృహాలు దీని ద్వారా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేశాయి.
అయితే, ఉచిత విద్యుత్ ప్రయోజనాలు పూర్తిగా అందాలంటే ఇంటి పైకప్పు విస్తీర్ణం, నీడ పడని ప్రదేశం, స్థానిక పంపిణీ సంస్థల ) నెట్-మీటరింగ్ నిబంధనలు అనుకూలంగా ఉండటం ముఖ్యం.
శిలాజ ఇంధనాల పరిమితులు మరియు నిల్వ వ్యవస్థల ప్రాధాన్యత
చమురు, సహజవాయువు మరియు బొగ్గు వంటి శిలాజ ఇంధనాల నిల్వలు రాబోయే దశాబ్దాల్లో క్షీణించే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి. వాతావరణ మార్పులు, కార్బన్ ఉద్గారాలు పెరగడం, వాయు కాలుష్యం వంటి సవాళ్ల నేపథ్యంలో పునరుత్పాదక శక్తికి మారడం అనివార్యంగా మారింది. అయితే, సూర్యుడు ఉన్న సమయంలో మాత్రమే సౌర విద్యుత్ లభిస్తుంది. రాత్రి వేళల్లో, వర్షాకాలంలో కూడా అంతరాయం లేని సరఫరా అందించాలంటే బలమైన బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులు సదా సిద్ధంగా ఉండాలి. పగటిపూట ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్‌ను గ్రిడ్ తీసుకోలేకపోతే ఆ నష్టం విద్యుత్ సంస్థలపై పడుతుంది.
డిస్కమ్లసవాళ్లు, గ్రిడ్ నిర్వహణ
సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యయం క్రమంగా తగ్గుతున్నప్పటికీ, వినియోగదారులకు చేరే విద్యుత్ చార్జీలు ఆ స్థాయిలో తక్షణమే తగ్గకపోవడానికి అనేక ఆర్థిక, సాంకేతిక కారణాలు ఉన్నాయి. డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సరిగా చెల్లింపులు జరగకపోతే పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుంది. ప్రసార నష్టాలు, గ్రిడ్ ఆధునీకరణ, విస్తారమైన నెట్‌వర్క్‌ను నిర్వహించడానికి, పీక్ డిమాండ్ సమయంలో ఇతర ఇంధన వనరులను అనుసంధానించడానికి అదనపు రవాణా వ్యయం అవుతుంది. భూసేకరణ ప్రక్రియలు.. భారీ సోలార్ పార్కుల నిర్మాణానికి వేల ఎకరాల భూమి అవసరం కావడం, ప్రసార మార్గాల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు పొందడం క్లిష్టతరమైన ప్రక్రియ.
పర్యావరణం, ఉపాధి అవకాశాలు
సౌర విద్యుత్ ప్రాజెక్టులు తయారీ, నిర్మాణం, ఇన్వర్టర్లు, మాడ్యూల్స్ శుభ్రపరచడం వంటి విభాగాలలో తాత్కాలిక, శాశ్వత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే కేవలం నిర్మాణ దశలోనే కాకుండా, నిర్వహణ రంగంలోనూ స్థానిక యువతకు తగిన నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు, పాతబడిన సౌర ప్యానెల్లు, ఈ వేస్ట్, ఇన్వర్టర్ వ్యర్థాల రీసైక్లింగ్ విధానాలు సమర్థవంతంగా లేకపోతే అవి భవిష్యత్తులో కొత్త పర్యావరణ సవాలుగా మారే ప్రమాదం ఉంది. హరిత విప్లవం సాధించే క్రమంలో ఈ వ్యర్థాల నిర్వహణకు స్పష్టమైన రూపురేఖలు అవసరం.
భవిష్యత్ దిశ
భారతదేశపు ఇంధన భద్రతకు సౌర శక్తి అత్యంత కీలకమైన మైలురాయి. కేవలం పరికరాల దిగుమతిపై ఆధారపడకుండా, స్వదేశీ తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరుతాయి. సౌర, పవన, జలవిద్యుత్ మరియు గ్రీన్ హైడ్రోజన్ వనరులను సమానంగా అనుసంధానించినప్పుడే దేశం పూర్తి స్థాయి ఇంధన స్వావలంబనను సాధించగలుగుతుంది. సంఖ్యల పరంగా సాధిస్తున్న విజయాలు నిజమైన ప్రజా ప్రయోజనంగా మారాలంటే, చౌకైన మరియు నాణ్యమైన విద్యుత్ ప్రతి ఒక్కరికీ నిరంతరాయంగా అందడమే అసలైన కొలమానం.
- సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
Solar power generation, India, PM Surya Ghar, Free Electricity Scheme, renewable energy sources, grid distribution system, solar panel subsidy





