Latest News

నిరంతర ఒత్తిడి.. నిత్య నరకం ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్ వేర్ ఉద్యోగం

posted on: Mar 10, 2026 11:12AM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏసీ గదులు, లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు.  అయితే బయటకు ఇంత గ్లామరస్ గా కనిపించే ఆ జీవితం వెనుక కష్టాలను, కన్నీటి గాథలను ఓ టెక్కి సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. ముఖ్యంగా బెంగళూరులో  టెక్కీల జీవితం నరక ప్రాయమని ఆ సీనియర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వ్యక్తం చేసిన ఆవేదన పై నెటిజనులు నూటికి నూరుపాళ్లు నిజం అంటూ స్పందిస్తున్నారు.  ఆ టెక్కీ సాప్ఘ్ వేర్ ఉద్యోగి దైనందిన కార్యక్రమం ఎలా మొదలై, ఎలా ముగుస్తుందో వివరించిన ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

 పొద్దున్న ఏడున్నరకు ఫిల్టర్ కాఫీతో మొదలై రాత్రి పదకొండున్నరకు కోడ్ రివ్యూతో ముగుస్తుందన్నది ఆ పోస్టు సారాశం. మొత్తం మీద ఆయన చెప్పిన దాని ప్రకారం ఉదయం ఎనిమిదిన్న లోపు  ఇంటి నుంచి బయటపడాలి. ఏ మాత్రం ఆలస్యమైనా బెంగళూరు ట్రాఫిక్ పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోవడం ఖాయం.  ఇక ఎలాగోలా ఆఫీసుకు చేరినా.. ఉదయం తొమ్మిదిన్నర నుంచీ టీమ్ మీటింగ్స్, ఆ మీటింగ్స్ మధ్యలో కూడా వందల సంఖ్యలో గ్రూపుల నోటిఫికేషన్లు.. వీటి మధ్య ఎలాగోలా పని ప్రారంభించినా.. బాస్ ల నుంచి అనవసర కాల్స్.. వీటి మధ్య పనిపై దృష్టి పెట్టి టాస్క్ పూర్తి చేయడమనేది అసిధారావ్రతంగా మారుతుంది. మామూలుగా ఒక మెయిల్ తో అయిపోయే పనికి కూడా గంటల కొద్దీ మీటింగ్ లు.. వీటన్నిటితో.. పని సాగక.. పెండింగ్ పని ఇంటి దగ్గర చేసుకోవచ్చులే అని ఆరున్నరకు ఆఫీసు నుంచి బయటపడినా.. రిలాక్స్ అనేదే ఉండదు. వాకింగ్ కు వెళ్లినా, జిమ్ కి వెళ్లినా మనసు మాత్రం పూర్తి చేయాల్సిన పని మీదే. ఇక రాత్రి పదకొండున్నర వరకూ పని చేసి కోడ్ రివ్యూ చేసి లాప్ టాప్ కట్టేసినా.. ఏ కాల్ వస్తుందో అని కలత నిద్ర, తలవద్ద లాప్ టాప్.. ఇలా ఒక రోజు.. రెండు రోజులూ కాదు.. ప్రతిరోజూ అశాంతే, ఆందోళనే, ఖంగారే, టాస్క్ పూర్తవుతుందా? లేదా అన్న ఆందోళనే...  
సీనియర్ టెక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల దైనందన జీవిత కష్టాలపై నెటిజనులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. దీనిపై స్పందించి దాదాపు అందరూ.. ఇది అచ్చంగా తమ జీవితమేనంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ట్రాఫిక్ వల్ల సగం శక్తి, అర్ధంపర్థం లేని మీటింగ్ ల వల్ల మిగిలిన సగం శక్తీ ఆవిరైపోతే.. ఇక అసలు పని ఎప్పటికి పూర్తయ్యేను? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇక పని ఎప్పుడు చేయాలి?" అని ప్రశ్నిస్తున్నారు. నిరంతర ఒత్తిడితో.. ఇసుమంతైనా ప్రశాంతత లేని జీవి ఈ భూ ప్రపంచం మీద ఏదైనా ఉందంటే.. ఆ జీవి కచ్చితంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగే అని నెటిజనులు సైటైర్లు వేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...