సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు స్మార్ట్ సర్వే

posted on: Jul 8, 2016 3:01PM

ప్రస్తుత రాజకీయ నాయకుల్లో టెక్నాలజీని చాకచాక్యంగా వాడి ప్రయోజనాలను రాబట్టుకొనే వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో నిలబడతారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాలనతో టెక్నాలజీని అనుసంధానం చేసి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుపొందారు. ఇప్పుడు నవ్యాంధ్రలోనూ అదే టెక్నాలజీతో ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. ఆర్థిక లోటుతో ఉన్నా అనేక సంక్షేమ పథకాలను రాజీ లేకుండా అమలు చేస్తున్నారు. పథకం ఎంత గొప్పదైనా ప్రజలకు చేరువైనప్పుడే ప్రయోజనం. కానీ అవినీతి, స్వార్థ ప్రయోజనాలు, దళారీలు చేరినప్పుడు లక్ష్యం ఎంత ఉన్నతమైనదైనా ఆశించిన ఫలితం లభించదు. ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నా మధ్యవర్తుల కారణంగా బడుగులకు చేరడం లేదు. వీటన్నింటిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి పేదలకు న్యాయం చేయాలంటే అసలేం జరుగుతుందో తెలియాలి. అందుకోసం చంద్రబాబు ఎంపిక చేసుకున్న అస్త్రం "ప్రజా సాధికార సర్వే".

 

సర్వే అంటే 10 పేజీల పుస్తకం లాంటి అప్లికేషన్ ఫారం నింపడం కాదు. అంతా డిజిటలైజేషన్ అవుతున్న కాలంలో సర్వే కోసం అత్యాధునిక ట్యాబ్‌లను వినియోగించనున్నారు. 4జీ సదుపాయం ఉన్న సిమ్ కార్డులు కొన్ని తీసుకున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఐరిష్, చేతి వేలిముద్రలు గుర్తించే పరికరాలు సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వే బృందం ఇంటింటికీ వస్తుంది, ఏ గ్రామానికి ఎన్యుమరేటర్‌గా దాదాపు ఆ గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి ఉంటారు.  ప్రతి ఇంటి యజమాని నుంచి సూక్ష్మంగా వివరాలు సేకరిస్తారు. విద్యార్హత, ఉపాధి, మరుగుదొడ్డి, ఇల్లు, ఫోన్ నెంబర్, అప్పులు, భీమా వివరాలు తీసుకుంటారు. ఇలా సేకరించిన సమాచారం మొత్తం వెబ్‌సైట్‌లో నమోదవుతుంది. ప్రభుత్వం భవిష్యత్‌లో ఏ పథకం తేవాలన్నా ఈ సర్వే ఆధారితంగా చేపట్టనుంది.

 

దీనిని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గుంటూరు, విశాఖ జిల్లాల్లో అమలు చేయనున్నారు. తన నుంచే ఈ సర్వే చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు..అధికారులు ఆయన నివాసానికి వచ్చి వివరాలు సేకరించారు. నిబంధనల మేరకు తన వేలి ముద్రలు, ఐరిష్ నమూనాలను అందజేశారు. సీఎం అధికారులకు తన కుటుంబసభ్యులను పరిచయం చేసి వారి వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు ప్రజా సాధికార సర్వేకు సహకరించాలని, దీని వల్ల సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని ముఖ్యమంత్రి సూచించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...