మీ ఫోనూ ట్యాప్ అయ్యింది.. విచారణకు వచ్చిన హరీష్ కు షాకిచ్చిన సిట్

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.  బీఆర్ఎస్ కీలక నేత, పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్న వాస్తవం వెలుగు చూసింది. ఈ విషయాన్ని   ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులే స్వయంగా తమ ఎదుట విచారణకు హాజరైన  హరీష్ రావుకు వెల్లడించారు. ది ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హరీష్ రావు కి విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న హరీష్ రావు మంగళవారం (జనవరి 20) అధికారుల ఎదుట హాజరయ్యారు.  హరీష్ రావును విచారించిన అధికారులు, 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని నెలల పాటు ఆయన ఫోన్ నిఘాలో ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పగానే హరీష్ రావ్   షాక్‌కు గురైనట్లు సమాచారం.

విచారణ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నను హరీష్ రావ్ స్వయంగా కాగితంపై రాసుకున్నారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందన్న విషయాన్ని తొలిసారి విన్న హరీష్ రావ్, వెంటనే , ఇది మీరు సృష్టించారా?  అని సిట్  అధికారులను ప్రశ్నించారు. అనంతరం స్పందించిన అధికారులు, ఫోన్ ట్యాపింగ్ జరిగిన తేదీలు, కాల వ్యవధి వివరాలను హరీష్ రావుకు తెలియజేశారు. అంతేకాదు, హరీష్ రావ్ అనుచరుల ఫోన్లు కూడా అదే సమయంలో కొన్ని ట్యాప్ అయ్యినట్టు సిట్ అధికారులు వెల్లడించడంతో విచారణ మరింత కీలకంగా మారింది. దీనిపై హరీష్ రావ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఈ కేసులో ఇప్పటివరకు పలువురు కీలక అధికారుల పేర్లు బయటకు రావడంతో పాటు, రాజకీయ నాయ కుల ఫోన్ల ట్యాపింగ్ అంశం ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది. తాజాగా హరీష్ రావ్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్న విషయం వెలుగులోకి రావడం కేసును మరో దశకు తీసుకెళ్లింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆదేశాలెవరివి?

ఎవరిని లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టారు?రాజకీయ లబ్ధి కోసమే ఈ ట్యాపింగ్ జరిగిందా? అన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. SIT దర్యాప్తు ముమ్మరం కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu