వాట్ టు డు?.. సిట్ నోటీసులపై ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ కీలక నేతల మంతనాలు

posted on: Jan 31, 2026 2:57PM

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ను కలవరపాటుకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నోటీసు విషయంలో ఎలా స్పందించాలి? ఏం చేయాలి అన్న విషయంపై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అగ్రనేతలు విస్తృతంగా చర్చించారు. కేసీఆర్ సిట్ ఎదుట హాజరు కావాలా? న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అన్న విషయంపై ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.  

సిట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు.  ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో  కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

 ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోనే స్టేట్మెంట్ రికార్డు చేయాలని డిమాండ్ చేయాలా? లేక సిట్ పేర్కొన్న ప్రదేశానికి హాజరై విచారణకు సహకరించాలా? అనే అంశంపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే  నంది నగర్ నివాసంలో స్టేట్మెంట్ రికార్డు చేస్తామనీ, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో స్టేట్మెంట్ రికార్డు చేయలేమని సిట్ అధికారులు తేల్చిచెప్పడంపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  సిట్ వైఖరిని చట్టపరంగా ప్రశ్నించాలా? లేదా సమయం కోరుతూ నోటీసులకు స్పందించాలా? అనే అంశాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.  

పార్టీ నేతలంతా  భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సిట్ నోటీసులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  కోర్టును ఆశ్రయించే అవకాశాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగిందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ రాజకీయంగా కీలక కేంద్రంగా మారగా, పార్టీ అగ్రనేత తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...