సిట్ నోటీసులపై కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ మంతనాలు
posted on: Jan 29, 2026 4:01PM

మాజీ సీఎం కేసిఆర్‌కు సిట్ నోటీసులు జారీ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరికాసేపట్లో ఫామ్ హౌస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ భేటీలో సిట్ నోటీసులపై తీసుకో వాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించ నున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా రేపు సిట్ ఎదుట హాజరవాలా? లేక విచారణకు సమయం కోరాలా? అనే అంశంపై ఇద్దరు నేతలు లోతైన చర్చ జరిపే అవకాశం ఉందని తెలు స్తోంది. న్యాయపరమైన అంశాలు, రాజకీయ ప్రభావాలు, తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే అంశంపైనా సమాలోచన జరిగే అవకాశముందని సమాచారం.
ఇప్పటికే సిట్ దూకుడు పెంచిన నేపథ్యంలో విచారణకు సంబంధించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలనే అభిప్రాయంతో కేటీఆర్, హరీష్ రావు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విచారణ అధికారిని సంప్రదించి తగిన గడువు కోరాలా? లేక నేరుగా హాజరై తమ వాదనను వినిపించాలా? అన్న అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రావడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.
ఈ సమావేశం తర్వాత పార్టీ పరంగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండగా, కేటీఆర్–హరీష్ రావు తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్లు కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. సిట్ పనితీరుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.



.webp)


