కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం
posted on: Jan 29, 2026 2:09PM
.webp)
మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి పిత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని తెలిపారు.
ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని హరీష్ రావు పేర్కొన్నారు. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు...ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిగా మారింది.
గతంలోనూ ఆయనకు మూడు సార్లు వేర్వేరు ఇష్యూల్లో నోటీసులు అందాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీఏలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. దానినిపై కేసీఆర్ హైకోర్టుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజి కూలడంపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషనూ నోటీసులిచ్చింది. కేసీఆర్ కమిషన్ ముందు హాజరయ్యారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పలుమార్లు కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


.webp)



