టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం
posted on Nov 20, 2025 3:22PM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు దర్యాప్తులో ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న అంశాలు విస్తుగొలుపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నది. అంతే కాకుండా ఈ వ్యవహారంలో వైసీపీ కీలక నేతల హస్తం ఉందని దర్యాప్తులో వెలుగులోనికి వస్తున్నది. జగన్ హయాంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని సిట్ ఇప్పటికే విచారించింది. ఈ విచారణలో ధర్మారెడ్డి కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ విచారించింది. గురువారం (నవంబర్ 19) ఉదయం వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే విచారించారు. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో సిట్ అధికారులు వైసీ సుబ్బారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో, పలు కీలక అధికారులు విచారణను ఎదుర్కొన్నారు. వారి వాంగ్మూలాలన సిట్ రికార్డు చేసింది. వారి విచారణలో వెలుగులోనికి వచ్చిన అంశాలు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారంతో అధికారులు సుబ్బారెడ్డిని విచారించారు. టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత, కొనుగోలు విధానాలు, కాంట్రాక్టుల కేటాయింపులపై సిట్ అధికారుల ప్రశ్నలతో వైవీ సుబ్బారెడ్డి ఉక్కిరిబిక్కిరైనట్లు సమాచారం. సుబ్బారెడ్డి విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోనికి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగం కేసులో వైవీ సుబ్బారెడ్డి విచారణ అత్యంత కీలకంగా భావిస్తున్నారు.
తొలుత ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే.. అరోగ్యం సహకరించని కారణంగా తాను విచారణకు రాలేననీ వైవీ చెప్పడంతో సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ వచ్చి సుబ్బారెడ్డిని ఆయన నివాసంలోనే విచారించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరిందన్న సంకేతాలను ఇచ్చింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై ఈ విచారణలో కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే. అప్పన విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా ఇప్పుడు సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.