Latest News

అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. అనుమానితుడి అరెస్టు

posted on: Mar 27, 2026 7:59AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  వరుస అగ్నిప్రమాదాలకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా పలు అనుమానాలు కూడా వ్యక్తమౌతున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక పురోగతి సాధించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి , రాయపూడి పరిధిలోని జరిగిన అగ్నిప్రమాద  ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో రామకుమార్ అనే వాచ్‌మెన్‌ను పోలీసులు గురువారం (మార్చి 26)  అదుపులోకి తీసుకున్నారు. గత సోమవారం రాత్రి సుమారు   రాజధాని ప్రాంతంలోని ప్రిన్సిపల్ కార్యదర్శుల బంగళాల  సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ అగ్నిప్రమాదం  అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న  మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు నిల్వ ఉంచిన చోట  సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది  పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మూడు ఫైర్ టెండర్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అగ్నిప్రమాదం సంభవించడానికి అవకాశం లేని మైదాన ప్రాంతంలో మంటలు ఎగసిపడటంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

 అమరావతి  అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న తరుణంలో  వరుస అగ్నిప్రమాదాల వెనుక   కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించి  ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్  ఏర్పాటు చేశారు. సిట్ రంగంలోకి దిగిన గంటల వ్యవధిలోనే ఈ అగ్రిప్రమాదాలకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోనికి తీసుకుంది.  అతడిని సిట్ విచారిస్తున్నది.  అమరావతి నిర్మాణ పనులకు ఆటంకం కలిగేలా వరుస అగ్ని ప్రమాదాలపై రాజధాని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా సిట్ విచారణలో అగ్నిప్రమాదాలకు అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని భావిస్తు న్నారు.    

google-ad-img
    Related Sigment News
    • Loading...