Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సింగరేణి టెండర్లపై ఆరోపణలు అవాస్తవం : డిప్యూటీ సీఎం భట్టి
posted on: Jan 24, 2026 3:46PM

సింగరేణి సంస్థ టెండర్లపై తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తప్పుడు కథనాలు రాసిన ఏబీఎన్ రాధాకృష్ణ తన రాతలు అసత్యమని స్వయంగా ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే అవి తన వ్యక్తిత్వ హననంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శనివారం జ్యోతిరావు పూలే భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ…
సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ నిబంధనను తాము కొత్తగా తీసుకురాలేదని తెలిపారు. ఈ నిబంధన ఇప్పటికే కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఆయిల్ కంపెనీలు, డిఫెన్స్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో చాలా ఏళ్లుగా అమలులో ఉందన్నారు. సీఎంపీడీఐఎల్ సూచనల మేరకు 2018 నుంచే సింగరేణిలో ఈ విధానం కొనసాగుతోందని స్పష్టం చేశారు.
సింగరేణి టెండర్లు రాజకీయ జోక్యంతో జరుగుతున్నాయన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సింగరేణి ఒక స్వయంప్రతిపత్తి సంస్థ అని, టెండర్లపై నిర్ణయాలు బోర్డు మరియు సీనియర్ అధికారులు విధివిధానాల ప్రకారం తీసుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా తన వద్దకు టెండర్ ఫైళ్లు రావని స్పష్టం చేశారు.
డీజిల్ సరఫరా కాంట్రాక్టర్లకు అప్పగించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలపైనా స్పందించారు. ఈ విధానం 2022లోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలులోకి వచ్చిందని చెప్పారు. జీఎస్టీ మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
నైనీ బ్లాక్ టెండర్ విషయంలో సీఎం రేవంత్ బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చారన్న ప్రచారాన్ని ఖండించారు. సుజన్ రెడ్డి కంపెనీకి ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థ యజమాని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమార్తె అని తెలిపారు. సింగరేణిలో ప్రధాన కాంట్రాక్టర్లు చాలామంది బీఆర్ఎస్‌కు సంబంధించిన వారేనని కూడా గుర్తు చేశారు.
2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టులపై విచారణకు సిద్ధమని భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆయనను కలిసి విచారణకు ఆదేశాలు ఇప్పిస్తానన్నారు.“సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిపై రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం. కార్మికుల రక్తం, చెమటతో ఏర్పడిన ఈ సంస్థను రాబందులకు అప్పగించను” అని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు, భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చివరగా, తనపై తప్పుడు ప్రచారాలు చేసిన రాధాకృష్ణ తన రాతలు అవాస్తవమని తిరిగి రాసి ప్రజలకు చెప్పాలని, లేకపోతే తదుపరి చర్యలు తప్పవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు.






