ఉత్తమ ఉపాధ్యాయులకు సింగపూర్ టూర్..మంత్రి లోకేష్
posted on Nov 6, 2025 8:45AM

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ జిల్లాకు ఇద్దరు చొప్పున ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి హస్తినకు విద్యాయాత్రకు పంపిన లోకేష్.. అదే విధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అధునాతన విద్యా విధానాలు, బోధనపై అవగాహన కలిగేలా, అధ్యయనం కోసం సింగపూర్ పంపించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన 78 మంది టీచర్లను ఈ నెల 27న సింగపూర్ పంపించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం (నవంంబర్ 5) విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో లోకేష్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ నెల 27 నుంచి వారం రోజుల పాటు 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ వారం రోజుల పర్యటనలో ఉపాధ్యాయులు సింగపూర్ లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించి, అక్కడి బోధనాపద్ధతులు, అనుసరిస్తున్న సాంకేతితక, పాఠశాల తరగతి గదులలో వాతావరణంఅక్కడి అధునాతన సాంకేతికలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాసు రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనంచేసి, రాష్ట్రంలో విద్యాప్రమాణాల మెరుగుకు ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయగలం అన్న అంశాలపై నివేదిక అందజేస్తారని తెలిపారు.