భారతీయులకు అలర్ట్.. సింగపూర్ కొత్తగా ‘నో బోర్డింగ్’ రూల్

posted on: Feb 5, 2026 1:54PM

 

సింగపూర్ ప్రభుత్వం కొత్తగా ‘నో బోర్డింగ్ ’ నిబంధనను అమలు చేసింది. దీనివల్ల కొన్ని పరిస్థితుల్లో ప్రయాణికులను విమానం ఎక్కనివ్వకుండా ముందే ఆపే అవకాశం ఉంటుంది. భారతీయులు ఎంతో ఇష్టంగా పర్యటించే దేశం సింగపూర్. 2026లో సింగపూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. తాజా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.  సింగపూర్ ఇమ్మిగ్రేషన్ అండ్ చెక్‌పాయింట్స్ అథారిటీ 2026 జనవరి 30 నుంచి ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం.. సింగపూర్‌లోని చాంగి, సెలెటార్ విమానాశ్రయాలకు వచ్చే అంతర్జాతీయ విమానాల ప్రయాణికులను ఫ్లైట్ ఎక్కే ముందే తనీఖీ చేస్తారు. అంటే సింగపూర్‌కు చేరుకున్న తర్వాత కాదు.. మనం బయలుదేరే విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ చెకింగ్ పూర్తవుతుంది. అర్హత లేకపోతే విమానం ఎక్కడానికే అనుమతించరు. 

ఈ నిబంధనలో భాగంగా ప్రయాణికుల వివరాలను ఫ్లైట్ మానిఫెస్ట్, సింగపూర్ (SG)అరైవల్ కార్డ్ ఆధారంగా ముందే పరిశీలిస్తారు. ఎవరికైనా సింగపూర్‌లోకి ప్రవేశించే అర్హత లేదని అధికారులు భావిస్తే.. ఆ సమాచారం నేరుగా సదరు విమాన సంస్థకు పంపిస్తారు. అప్పుడు ఆ ప్రయాణికుడిని విమానం ఎక్కడానికి అనుమతించరు. అలాగే చెల్లుబాటు అయ్యే వీసా ఉందా? పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల వరకూ చెల్లుబాటు అవుతుందా? SG అరైవల్ కార్డ్ సరిగ్గా దరఖాస్తు చేశారా? లేదా? అనే అంశాలపై అదనపు తనిఖీలు కూడా జరగవచ్చు. ప్రయాణికులను సింగపూర్ చేరుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద ఆపేవారు. 

ఇప్పుడు ఆ ప్రక్రియను విమానం ఎక్కడానికి ముందే పూర్తి చేస్తున్నారు. అర్హులైన ప్రయాణికులకే సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఇస్తున్నారు. ఈ నిబంధనలను పాటించని విమానయాన సంస్థలపై సింగపూర్ ప్రభుత్వం $10,000 వరకు జరిమానా విధించవచ్చు. అవసరమైతే విమాన సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విమానం ఎక్కే అవకాశం నిరాకరిస్తే అలాంటి పరిస్థితిలో.. ఇమ్మిగ్రేషన్ అండ్ చెక్‌పాయింట్ అథారిటీ  ఫీడ్‌బ్యాక్ ఛానల్ ద్వారా సంప్రదించి సింగపూర్‌లోకి ప్రవేశం కోసం అనుమతి కోరవచ్చు. సింగపూర్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే.. వీసా చెల్లుబాటు, పాస్‌పోర్ట్ గడువు, SG అరైవల్ కార్డ్ వివరాలు అన్నీ ముందుగానే సరిచూసుకుని బయలుదేరితే చివరి నిమిషంలో ఎదురయ్యే ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...