Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జోషువా ప్రాజెక్ట్.. నిశ్శబ్ద మతమార్పిడి ఆపరేషన్!
posted on: May 12, 2026 11:17AM

భారతదేశంలోని సామాజిక నిర్మాణాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ నెట్‌వర్క్ పనిచేస్తోంది. 'జోషువా ప్రాజెక్ట్' పేరుతో ఈ సంస్థ, దేశంలోని ప్రతి మారుమూల గ్రామాన్ని, ప్రతి కులాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ తన మతమార్పిడి కార్యకలాపాలను విస్తరిస్తోంది. 1995లో అమెరికా వేదికగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ మిషన్.. ప్రస్తుతం భారత్‌ను తన ప్రధాన లక్ష్యంగా మార్చుకుంది. ముఖ్యంగా సువార్త చేరని వర్గాలు (అన్ రీచ్ డ్ పీపుల్స్ గ్రూప్స్) పేరుతో దేశంలోని 95 శాతానికి పైగా జనాభాను తమ పరిధిలోకి తెచ్చుకునేందుకు ఈ సంస్థ పక్కా ప్రణాళికలతో తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కేవలం మత ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా.. అత్యంత ఆధునిక సాంకేతికత, డేటా అనలిటిక్స్‌ను ఉపయోగిస్తోంది. దేశంలో పోస్టల్ పిన్‌కోడ్ వ్యవస్థను ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ కులానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారు.. వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి, వారు మాట్లాడే భాష ఏమిటి అనే అంశాలపై పూర్తిస్థాయి మ్యాపింగ్ నిర్వహించింది. ఈ గణాంకాల ప్రకారం, దేశంలో సుమారు 2,272 కుల సమూహాలను గుర్తించిన ఈ సంస్థ, వాటిలో 2,041 వర్గాలను ఇంకా అన్ రీచ్ డ్ గా గుర్తించింది. వాటిని రీచ్ కావలసిన అవసరాన్ని గుర్తించింది.

ఇప్పటికే సుమారు 6 కోట్ల మందికి పైగా వ్యక్తులను ఈ నెట్‌వర్క్ చేరుకోవడం గమనార్హం. జోషువా ప్రాజెక్ట్ అనుసరిస్తున్న మతమార్పిడి పద్ధతులు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం, జోషువా ప్రాజెక్ట్ క్షేత్రస్థాయిలో పనిచేసే ఏజెంట్లకు బిలీవర్స్ చర్చిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని గ్రామాల్లోకి పంపి సమాచారాన్ని సేకరిస్తున్నది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాల పేరుతో పేదలను ఆకర్షించడం, చర్చికి వస్తేనే చికిత్స అందిస్తామనే షరతులు విధించడం వంటి అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. దీనితో పాటు ఆర్థిక సహాయం, విద్యా అవకాశాలు, ప్రభుత్వ పథకాల పేరుతో ఆవాసాలు కల్పిస్తామనే వాగ్దానాలతో పేద వర్గాలను తమవైపునకు తిప్పుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక పరిశోధన మేరకు మతం మార్పించడానికి రూ. 2,000, క్రైస్తవ వివాహానికి రూ. 1,500 చొప్పున చెల్లించింది. అలాగే బీహార్లో 118 చైల్డ్ కేర్ సెంటర్లు, పాఠశాలలు మిషనరీ నిధులతో నడుస్తున్నాయి. ఒడిశాలోని కంధమాల్, రాయగడ వంటి గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. జీసస్ భజన్ వంటి సాంస్కృతిక సాధనాలు స్థానిక సంస్కృతికి అనుగుణంగా క్రైస్తవ మతాన్ని ఆకర్షణీయంగా చూపిస్తున్నాయి.
ఈ కార్యకలాపాలు ప్రధానంగా గిరిజన, దళిత వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరంలలో ఇప్పటికే జనాభా నిష్పత్తిలో భారీ మార్పులు సంభవించాయి. నాగాలాండ్లో 90శాతానికి పైగా జనాభా క్రైస్తవులుగా ఉన్నారు. మిజోరం, మేఘాలయ, మణిపూర్లలో కూడా గణనీయమైన మార్పులు సంభవించాయి. పరిశోధకులు ఈ ప్రాంతాల్లో మతమార్పిడి మరియు సాంస్కృతిక-రాజకీయ వేర్పాటువాద ధోరణులకు మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు.
తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ మిషన్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. హ్యూస్టన్ కేంద్రంగా పనిచేసే కొన్ని సంస్థలు ఇప్పటికే లక్షలాది మందిని తమ మతంలోకి చేర్చుకున్నట్లు సమాచారం. అయితే.. ఇంత భారీ స్థాయిలో కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ, కీలక రాష్ట్రాల హోం మంత్రిత్వ శాఖలు తమకు ఈ ప్రాజెక్ట్ గురించి సమాచారం లేదని చెప్పడం పరిపాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతోంది. మరోవైపు.. ఈ వ్యవహారంపై భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. క్రైస్తవ మిషనరీ మద్దతుదారులు ఇది కేవలం కుల వివక్ష నుండి విముక్తి పొందే మార్గమని వాదిస్తున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం మతమార్పిడి నిరోధక చట్టాలు వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతమని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను, మతమార్పిడి చట్టాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తోంది. జోషువా ప్రాజెక్ట్ యాజమాన్యం తాము కేవలం సమాచారాన్ని అందించే పరిశోధన సంస్థ మాత్రమేననీ.. ప్రత్యక్షంగా మతమార్పిడులకు పాల్పడడం లేదని సమర్థించుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మతమార్పిడి వ్యూహాలను అడ్డుకునేందుకు చట్టాలను కఠినతరం చేశాయి.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మతమార్పిడి నేరాలకు భారీ శిక్షలతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠిన నిబంధనలను ప్రవేశపెట్టారు. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) ఉల్లంఘనలపై కూడా నిఘా పెరిగింది. ఏది ఏమైనా, కేవలం చట్టాల ద్వారానే కాకుండా.. హిందూ సమాజంలో అంతర్గత సంస్కరణలు తీసుకురావడం, వెనుకబడిన వర్గాలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారానే ఇటువంటి మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకోవచ్చని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ దేశ భద్రత, సామాజిక సామరస్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






