113 ఏళ్ల ఢిల్లీ జింఖానా క్లబ్‌కు షాక్!

posted on: May 27, 2026 2:49PM

దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశేషాధికారానికి ప్రతీకగా నిలిచే ఢిల్లీ జింఖానా క్లబ్‌కు భారత ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. సఫ్దర్జంగ్ రోడ్‌లోని 27 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న ఈ క్లబ్‌ను రెండు వారాల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ క్లబ్ భారత ప్రభుత్వానికి ఏడాది కేవలం  వెయ్యిరూపాయల లీజు అద్దె మాత్రమే  చెల్లిస్తోంది. 27 ఎకరాల ప్రధాన భూభాగానికి ఇదే అద్దె. రక్షణ, ఇత‌ర‌త్రా భద్రతా సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ భూమి అత్యవసరమని అంటోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నివాసంతో సహా.. అనేక భద్రతా సంస్థలకు ఈ క్లబ్ అత్యంత సమీపంలో ఉంది.  

ఢిల్లీ జింఖానా క్లబ్‌ను 1913లో బ్రిటిష్ పాలనలో  ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ గా స్థాపించారు. ప్రారంభంలో ఇది బ్రిటీష్ అధికారులకు, ఆనాటి ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఒకానొక సమయంలో భారతీయులకు ఇక్కడ ప్రవేశం లేదు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత, పేరు నుంచి ఇంపీరియల్ పదం తొలగించినా, ఆ మనస్తత్వం మాత్రం పూర్తిగా మారలేదని అంటారు విమర్శకులు.

ఇక ఈ క్ల‌బ్బు స‌భ్య‌త్వ నిర్మాణం 40-40-20గా ఉంటుంది. దశాబ్దాలుగా ఈ క్లబ్ ఒక ప్రత్యేక సూత్రాన్ని అనుసరించింది. ఇందులో ఉన్న‌తాధికారులు 40 శాతం, డిఫెన్స్ స్టాఫ్‌- 40 శాతం, ఇత‌రులు అంటే ప‌లుకుబ‌డి గ‌ల కుటుంబాలు, ఇత‌ర‌త్రా  పారిశ్రామిక వేత్త‌ల‌కు  20 శాతం వ‌ర‌కూ ఇందులో స‌భ్య‌త్వం పొందే అవ‌కాశ‌ముంది.

కేవలం డబ్బు ఉంటే చాల‌దు.. అక్కడ సభ్యత్వం పొందడానికి సరైన ఇంటిపేరు, అంత‌క‌న్నా మించిన‌ సిఫార్సులు, అన్నిటిక‌న్నా మించిన సామాజిక వ‌ర్గ హోదా త‌ప్ప‌క ఉండాలి. సభ్యత్వం పొందడానికి వెయిటింగ్ లిస్ట్  37 సంవత్సరాల వరకు ఉంటుందని సమాచారం. కార్పొరేట్ సభ్యత్వాల ఖరీదు 15 నుంచి 20 లక్షల రూపాయల మధ్య ఉండగా.. ప్రైవేట్ సభ్యత్వాలు 10 లక్షల రూపాయల వరకు ఉండేవి.

ఇక ఆర్థిక అవకతవకల ఆరోపణల విష‌యానికి వ‌స్తే.. కేవలం భూ వివాదం మాత్రమే కాదు.. ఈ క్లబ్ అంతర్గత పాలనపై కూడా తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. 2022లో, క్లబ్ వ్యవహారాల నిర్వహణపై ఆందోళనల  నేపథ్యంలో, జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్-ఎన్ సీఎల్టీ.. క్లబ్ నిర్వహణలో ప్రభుత్వ జోక్యానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉంది. ఇక పోతే    క్ల‌బ్బును ఖాళీ చేయించేలా ఇచ్చిన ప్ర‌భుత్వ‌ ఉత్తర్వును సభ్యులు సవాలు చేస్తున్నారు.

ఈ క్లబ్‌తో అనుబంధం ఉన్న ఒక మాజీ సభ్యుని.. జింఖానా క్లబ్  చారిత్ర‌క‌మైన‌ది. ఈ సంస్థ క‌నుమ‌రుగు కావ‌డం బాధాక‌రం ఎందుకంటే ఇక్క‌డ ఒక బుక్ క్ల‌బ్ ఉండేది. ఇలాంటి ప్ర‌దేశాలు ఇప్పుడు రాను రాను క‌నుమ‌రుగు అవుతున్నాయంటారాయ‌న‌.  ముఖ్యంగా వ‌యో వృద్ధులైన స‌భ్యుల‌కు ఇక్క‌డున్న  వ‌స‌తి స‌దుపాయాల‌ను లేకుండా చేయ‌డం ఎంతో ఇబ్బందిక‌రంగా మారుతుంది.  ఢిల్లీ జింఖానా కేవలం ఒక క్లబ్ కాదు, అది అల‌నాటి ఎన్నో చారిత్ర‌క జ్ఞాప‌కాల‌కు ఆల‌వాలం అంటారు వీరు.  

ప్రభుత్వం ఈ క్ల‌బ్ విష‌యంలో.. లీజు ఒప్పందంలోని 4వ నిబంధనను అమలు చేస్తోంది. ఈ నిబంధన ప్రకారం, ప్రజా ప్రయోజనాల కోసం ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. భారత్ బలపడితే ముందుగా నష్టపోయేది చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాలే అనే అంశంలోంచి చూస్తే.. జాతీయ భద్రతకు ఈ భూమి అత్య‌వసరమని వాదిస్తోంది కేంద్ర‌ ప్రభుత్వం. 

ఇలాంటి ప్ర‌త్యేక సంస్థలు ప్రస్తుత కాలమాన ప‌రిస్థితుల‌తో సంబంధం తెగిపోయినట్లుగా ఉంటున్నాయని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. క‌రోనా మహమ్మారి తర్వాత  ఇండియ‌న్ అర్బ‌న్ ఏరియాస్ లో స‌రికొత్త  సోష‌ల్ ఎన్విరాన్మెంట్ రూపుదిద్దుకుంటోంది.  బుక్ క్లబ్‌లు, ఓపెన్ మైక్‌లు, ఫిల్మ్ స్క్రీనింగ్‌లు, అండర్‌గ్రౌండ్ మ్యూజిక్ గిగ్స్, రన్నింగ్ క్లబ్‌లు, హెరిటేజ్ వాక్‌లు, స్వతంత్ర థియేటర్ వేదికలు, కేఫ్ పాప్-అప్‌లు ఇలాగ‌న్న‌మాట‌. ఇలాంటి ఓపెక్ క్ల‌బ్  క‌ల్చ‌ర్ ఇప్పుడు ఢిల్లీలో వెల్లివిరుస్తోంది. 

పెద్ద పెద్ద‌ మార్పులు వాటంతటవే ఏర్ప‌డ‌వు. అవి చిన్న చిన్న అలజడుల రూపంలో వస్తాయి.  నిశ్శబ్దంగా మార్చిన నిబంధనలు, ఊహించని నోటీసులు, పాత సంస్థలు మూతప‌డేందుకు బాట‌లు ప‌రుస్తాయి. ఢిల్లీ జింఖానా విషయం కేవలం ఒక భూ వివాదం కాదు. ఇది ఒక యుగానికి, ఒక ఆలోచనా విధానానికి ముగింపునకు సంకేతం.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...