బురిడీబాబా దొరికాడు..

posted on: Jun 17, 2016 4:15PM

డబ్బును రెట్టింపు చేస్తానంటూ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి ఇంటి నుంచి రూ.1.33 కోట్లు ఎగరేసుకుపోయిన బురిడీబాబా పోలీసులకు చిక్కాడు. తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిన్న రాత్రి బెంగుళూరులో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లికి చెందిన శివకుమారస్వామి ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఇంట్లోంచి వస్తూ కొంత బంగారం, నగదు ఎత్తుకెళ్లాడు. వీటితో తిరుపతి, బెంగుళూరు, కేరళలోని కొన్ని ఆశ్రమాలకు వెళ్లి అక్కడి స్వామీజీలను కలిశాడు. ఈ నేపథ్యంలో కొందరు దొంగస్వాములతో పరిచయాలు పెంచుకుని జనాన్ని ఎలా మోసగించవచ్చో తెలుసుకున్నాడు. అనంతరం బాబా అవతారమెత్తి. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని..ముగ్గులో కరెన్సీ నోట్లను ఉంచి తాను పూజ చేస్తే చాలు..రెట్టింపు అవుతాయంటూ నమ్మించేవాడు.

 

నిష్టగా పూజ చేసి..ముగ్గులో రూపాయి నోట్లను ఉంచి గులాబీలను కప్పేవాడు. ఆపై అరగంట సేపు ధ్యానం చేసి మత్తుమందు కలిపిన పరమాన్నం, చక్కెర పొంగలి ఇచ్చేవాడు. బాధితులు మత్తులోకి జారుకున్నాకా నగదుతో ఉడాయించేవాడు. నాలుగేళ్లుగా అందినకాడికి దోచుకుంటూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మోసాలకు పాల్పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ద్వారా లైఫ్‌స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డికి శివానంద పరిచయమయ్యాడు. బెంగుళూరులోని తన నివాసంలో ఒకరోజు పూజ చేసి రూ.1.5 లక్షల నగదును, రూ.3 లక్షలుగా మార్చి వారికి నమ్మకం కలిగించాడు.

 

ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని తన ఇంటికి మరమ్మత్తులు చేయించారు మధుసూదన్‌రెడ్డి..అందులో లక్ష్మీపూజ, దోష నివారణ పూజ చేయించే ఉద్దేశ్యంతో బెంగుళూరులో శివానందను కలిశారు. ఆయన ఆహ్వానం మేరకు మొన్న హైదరాబాద్‌కు వచ్చిన శివానందకు తన డబ్బుతో పాటు స్నేహితుల డబ్బు మొత్తం రూ.1.33 కోట్లును ఇచ్చి రెట్టింపు చేయాల్సిందిగా కోరారు. సరేనన్న శివానంద పూజలో కూర్చొన్నాడు. ఎప్పటిలానే మత్తు మందు కలిపిన పరమాన్నాన్ని మధుసూదనరెడ్డి కుటుంబసభ్యులకు పంచాడు. దాన్ని తిన్న వెంటనే వారంతా స్పృహ తప్పారు. అనంతరం నగదు, నగల్ని మూటగట్టుకున్న బాబా నేరుగా బెంగుళూరుకు చేరుకున్నాడు. వ్యాపారి ఇంట్లోనూ, బాబా దిగిన ఓరిల్స్ హోటల్స్‌లోని సీసీ కెమెరా ఫుటేజీల సాయంతో రంగంలోకి దిగిన పోలీసులు శివానంద కోసం వేట ప్రారంభించారు. శివానందను బెంగుళూరు నుంచి హైదరాబాద్ తీసుకువచ్చిన డ్రైవర్‌ను సమాచారం మేరకు బెంగుళూరు చేరుకున్న తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బాబాని అదుపులోకి తీసుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...