మహేశ్వరంలో ఉద్రిక్తత.... శివాజీ విగ్రహం ప్రతిష్టాపనపై వివాదం
posted on: Feb 12, 2026 2:24PM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారి తీసింది. తెల్లవారుజామున కొందరు వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం పక్కన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు రెండు వర్గాలుగా విడిపోయి ఆందోళనకు దిగారు. విగ్రహాన్ని అనుమతి లేకుండా ఏర్పాటు చేశారంటూ ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేయగా, మరో వర్గం శివాజీ మహారాజ్‌కు గౌరవ సూచకంగా విగ్రహం ఏర్పాటు చేశామని పేర్కొంది.
స్థానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు యువకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు ఏర్పాట్లు ప్రారంభించమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం పక్కనే మరో విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల సామాజిక వాతావరణం దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు. పరస్పర గౌరవాన్ని కాపాడాలని, ప్రభుత్వం జోక్యం చేసుకుని స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు అను మతులు తీసుకోకుండా కార్యక్రమం నిర్వహించ రాదని పోలీసులు స్పష్టం చేశారు. చట్టసమ్మతమైన ప్రక్రియను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు వర్గాల నాయకులతో చర్చలు జరిపి శాంతి భద్రతల దృష్ట్యా శివాజీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. అనంతరం విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాల యానికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాల ఏర్పాటు విషయంలో అధికారుల అనుమతి తప్పనిసరి అని పోలీసులు సూచించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.


.webp)
.webp)


