పులి లాంటి శివసేన… పులిహోర పార్టీ అవుతోందా?

posted on: Apr 7, 2017 11:47AM

 

రాను రాను రాజు గుర్రం అదేదో అయిందట! అలానే వుంది శివసేన పరిస్థితి! పేరులో వున్న శివ… ఛత్రపతి శివాజీ నుంచీ తీసుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు …. హిందూ హృదయ సామ్రాట్ బాల్ థాక్రే! అయినా కూడా రాను రాను శివసేన వ్యవహార శైలి మరీ దారుణంగా తయారవుతోంది. అంతకంతకూ మొరటుగా, మోటుగా మారిపోతోంది!

 

ప్రస్తుతం పార్లమెంట్లో కూడా రచ్చకి కారణమైంది శివసేన ఎంపీ రవీంద్ర గౌక్వాడ్. ఆయన చేసిన ఘనకార్యం అందరికీ తెలిసిందే! ఎయిర్ ఇండియా ఎంప్లాయిని పాతిక సార్లు చెప్పుతో కొట్టి, దాన్ని కెమెరాల ముందు గొప్పగా చెప్పుకున్నాడు. మళ్లీ ఇప్పుడు విమానాల్లో తిరగనీయాలంటూ పార్లమెంట్లో సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు ఒక ఎంపీ ఒక ఉద్యోగిని కొట్టటమే తప్పంటే… అదే శివసేనకి చెందిన ఒక కేంద్ర మంత్రి, అనంత్ గీతే, విమానయాన శాఖా మంత్రిపైనే చేయెత్తాడు! నిండు పార్లమెంట్లో శివసేన వారి వ్యవహారం ఇలా వుంటే… ఇక ఒక మామూలు ఎయిర్ పోర్ట్ ఉద్యోగిపై అరాచకం ఎలా వుంటుందో మనం స్పష్టంగా ఊహించుకోవచ్చు! ఇంతకాలం శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తప్పు లేదేమో అనుకున్న వారు కూడా పార్లమెంట్లో ఆ పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రి చేసిన నిర్వాకం చూస్తే … గుడ్డిగా నమ్మేస్తారు… సదరు రవీంద్ర గైక్వాడ్ ఒక గూండా అని!

 

రాజకీయ నాయకులు గూండాగిరి, రౌడీయిజం చేయటం పెద్ద ఆశ్చర్యకరమూ కాదు, మాట్లాడుకున్నా లాభం వుండే విషయమూ కాదు! మన దేశంలో పరిస్థితి అలా తయారైంది! కాని, శివసేన వారి దౌర్జన్యం మరీ విడ్డూరం! ఏకంగా పార్లెమంట్లో విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజునే వారు టార్గెట్ చేశారు! ఇప్పుడే కాదు… శివసేన ఈ మధ్య కాలంలో ఇలాంటి అరాచక, ఉన్మాద చర్యలకు పదే పదే పాల్పడుతోంది. ఆ మధ్య మహారాస్ట్రలోని బీజేపి సర్కార్ జైన మతస్థుల పండుగ సందర్భంగా కొన్నాళ్లు మాంసపు దుకాణాలు బంద్ చేయించింది! అప్పుడు కూడా హిందూ సమాజానికి రక్షణగా వుంటామని చెప్పుకునే శివసేన … కేవలం బీజేపి మీద కసితో … జైన మతస్థుల మనోభావాలు దెబ్బతీసింది. వాళ్ల గుళ్ల ముందే పచ్చి మాంసం విక్రయిస్తూ శునకానందం పొందింది!

 

బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే … ఆ పార్టీని, మోదీని తిట్టిపోయటం ఉద్ధవ్ థాక్రేకు పరిపాటి అయిపోయింది. దానికి తోడు సాదాసీదా టోల్ గేట్ ఉద్యోగులు మొదలు కేంద్ర మంత్రి దాకా ఎవర్నైనా కొట్టటం , దాడులు చేయటం కూడా శివసేన వారికి సంప్రదాయంగా మారింది! ఇదే చేస్తే … ఇప్పటికే సగం మునిగిన శివసేన పడవ మొత్తం మునగక మానదు. ఎందుకంటే, మహారాష్ట్రలో జరుగుతోన్న వరుస ఎన్నికల్లో క్రమంగా బీజేపి బలం పుంజుకుంటూనే వుంది. దానికి తోడు శివసేన ఇలాంటి రౌడీయిజాలకు పాల్పడితే… కమల వికాసం మరింత సులువైపోతుంది!

google-ad-img
    Related Sigment News
    • Loading...