శిల్పా రెండింటికి చెడతారా..?
posted on Aug 3, 2017 3:41PM
.JPG)
రెండింటికి చెడ్డ రెవడి అని పెద్దలు ఎందుకు అన్నారో తెలియదు కానీ ఇప్పుడు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డికి ఈ సామెత అతికినట్లు సరిపోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ టికెట్ ఆశించిన ఆయన తమ్ముడు శిల్పా మోహన్ రెడ్డి భంగపడ్డారు. దీంతో ఆయన తెలుగుదేశానికి రాజీనామా చేసి జగన్ గూటికి చేరి నంద్యాల టికెట్ సంపాదించారు. ఇదంతా బాగానే ఉంది కానీ శిల్పా బ్రదర్స్ ఎప్పుడూ ఒకే పార్టీలో ఉంటారు. అన్న ఒక పార్టీలో..తమ్ముడు ఒక పార్టీలో ఉండరు. ఈ నేపథ్యంలో శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది.
అయితే టీడీపీని వీడటంపై స్పందించిన చక్రపాణి తనకు జగన్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు..అలాగే టీడీపీలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని ఆరోపించి పార్టీ మారడంపై కార్యకర్తలతో సమావేశమై తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఇలా చెప్పిన రెండు రోజులకే చక్రపాణి సైకిల్ దిగి ఫ్యాన్ దగ్గరకు వెళ్లారు. అయితే ఇక్కడే ఆయనకు ఊహించని షాక్ తగిలింది.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లే, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ షరతు పెట్టారట. దీంతో చక్రపాణిరెడ్డి డైలమాలో పడ్డారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంలో పునరాలోచించాలని ఆయన భావిస్తున్నట్లు నంద్యాలలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలనే విషయాన్ని జగన్ తనకు ముందుగా చెప్పలేదని..అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని ఆయన వాపోతున్నారు. మరి, చక్రపాణి వైసీపీలో చేరుతారా..? లేక టీడీపీలోనే కొనసాగుతారా అన్నది తేలిపోనుంది.