తిరిగొచ్చే ప్రయత్నాలు ప్రారంభం...

 

‘‘జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన నష్టం కూడా భారీగా జరిగింది... ఇక ఇక్కడే వుండి అవమానాల పాలు కావడం కంటే మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతే మనశ్శాంతి అయినా మిగులుతుంది’’ ఇదీ ప్రస్తుతం శిల్పా సోదరుల మనసులో మెదులుతున్న ఆలోచన.. ఆచరణలోకి పెట్టడానికి సిద్ధమవుతున్న ఆలోచన. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీని విడిచి వైసీపీలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తగిన మూల్యం చెల్లించారు. అన్నయ్య ఓడిపోయాడు.. తమ్ముడు నిక్షేపం లాంటి ఎమ్మెల్సీ పదవిని వదిలిపెట్టి, శాసనమండలి ఛైర్మన్ అయ్యే గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు. రాజకీయాల్లో ఎంతమాత్రం పనికిరాని ఆవేశం ఆవహించిన ఈ సోదర ద్వయం ఇప్పుడు చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో వున్నారు.. మళ్ళీ టీడీపీ తలుపు తట్టడానికి సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

 

ప్రశాంతంగా, ఏకగ్రీవంగా జరగాల్సిన నంద్యాల ఉప ఎన్నిక తమ అనాలోచిత చర్యల వల్లే పెద్ద ఇష్యూ కావడంతోపాటు తమకు పరాజయం, అవమానం దక్కాయని శిల్పా బ్రదర్స్ వాస్తవం తెలుసుకున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ముందు వరకూ రాబోయేది తమ ప్రభుత్వమేనంటూ వైసీపీ వర్గాలు కన్న కలలు ఆ తర్వాత కల్లలుగా తేలిపోయాయి. ఎప్పటి నుంచో వైసీపీ నీడలో వుంటున్న వారే ఆ పార్టీ నుంచి మెల్లగా జారుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఆ పార్టీలో చేరిన తాము అక్కడ కొనసాగడంలో అర్థం లేదని శిల్పా బ్రదర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో వున్న తమ సన్నిహితుల ద్వారా తమ ‘మారిన మనసు’ను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నంలో వున్నారు.

 

అయితే శిల్పా బ్రదర్స్‌ని వైసీపీలో పెద్దగా పట్టించుకోవడం లేదన్నట్టుగా సమాచారం. ఎమ్మల్సీ పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరిన చక్రపాణిరెడ్డి ఆ తర్వాత కొద్ది రోజులకో జ్ఞానోదయం కలిగి నంద్యాలలో ప్రచారానికి కూడా దూరంగా వున్నారు. అప్పటి నుంచే ఆయన పార్టీకి డిటాచ్ అయిపోయారు. ఇక నంద్యాలలో ఓడిపోయిన మోహనరెడ్డి ఇప్పుడు చెల్లని కాసు అయిపోయాడు. అలాగే ఈ ఇద్దరు అన్నదమ్ములను తిరిగి టీడీపీలోకి తీసుకునే ఆలోచన పార్టీ అధినేత చంద్రబాబుకు లేనట్టు తెలుస్తోంది. నంద్యాల విషయంలో ఎంత బుజ్జగించినా వినకుండా ఎన్నికల పోరు జరిగేలా చేసిన వీరి విషయంలో మెత్తగా వ్యవహరించకూడదని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.