Latest News
తెలంగాణలో రూ.100 కోట్లతో మ్యూల్ అకౌంట్ల నెట్‌వర్క్ బట్టబయలు
posted on: Mar 10, 2026 9:52PM

తెలంగాణలో సైబర్ మోసాలపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసి మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్‌వర్క్‌ను బట్టబయలు చేశారు. మొత్తం 1,888 అనుమానాస్పద ఖాతాలను గుర్తించగా, వాటి ద్వారా సుమారు రూ.100 కోట్ల వరకు మోసాలు జరిగినట్లు అంచనా వేశారు.
ఈ ఆపరేషన్‌లో 549 కేసులు నమోదు చేసి 626 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 208 మందిని అరెస్టు చేశారు. కొందరు తమ బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు దర్యాప్తులో బయటపడింది. అరెస్టైన వారి నుంచి మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు తమ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని, ఖాతాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం తీవ్రమైన నేరమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.






